ఇక నుంచి యూపీఐ లావాదేవీలు అదేనండి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ఆధారిత సేవలపై ఛార్జీలు వసూలు చేస్తారనే వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై కేంద్ర సర్కార్ క్లారిటీ ఇచ్చింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలుచేసే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆర్బీఐ అధ్యయనం చేస్తోందంటూ ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది.
‘యూపీఐ అన్నది ప్రజలకు ఉపయోగపడే డిజిటల్ వ్యవస్థ. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకత కూడా పెరిగింది. అందువల్ల యూపీఐ సేవలపై ఎలాంటి ఛార్జీలూ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. సర్వీస్ ప్రొవైడర్స్ తమకు అయ్యే వ్యయాన్ని ఇతరత్రా మార్గాల ద్వారా భర్తీచేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం గతే డాది డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్‌కి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయాన్ని అందించింది. డిజిటల్ చెల్లింపులను మరింత మంది స్వీకరించేలా వినియోగదారులకు అనువైన చెల్లింపు వేదికలను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ ఏడాది కూడా అదే సాయాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది’ అని ఆర్థికశాఖ వెల్లడించింది.
సాధారణంగా క్రెడిట్ కార్డు లావాదేవీలు నిర్వహించినప్పుడు మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) ఛార్జీలను విధిస్తుంటారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు పంచుకుంటాయి. ఇదే విధంగా యూపీఐ లావాదేవీలపైనా ఎండీఆర్ తరహా ఛార్జీలను విధిస్తే, సంబంధిత సంస్థలు మరింత సమర్థంగా సేవలను అందిస్తాయని ఆర్బీఐ భావిస్తోంది. ఎండీఆర్ తరహాలోనే లావాదేవీ మొత్తంపై నిర్ణీత శాతాన్ని రుసుముగా వసూలు చేయాలా? లేదా లావాదేవీకి స్థిరంగా కొంత మొత్తం వసూలు చేయాలా అనే విషయంపై ప్రజాభిప్రాయం కోరుతూ ‘చెల్లింపుల వ్యవస్థల్లో ఛార్జీలు’ అనే చర్చా పత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది రిజర్వు బ్యాంకు.
దీనిపై అక్టోబరు 3 లోపు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరింది.ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్)తోపాటు, డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పీపీఐ) తదితరాలకూ ఛార్జీల ప్రతిపాదనను చేసింది. విధివిధానాలు, నిబంధనలు, ఇతర అంశాలపైనా సూచనలివ్వాలని కోరింది ఆర్బీఐ.
యూపీఐ ఆధారిత చెల్లింపులు ప్రస్తుతం రోజుకు 21 కోట్లకు పైగా జరుగుతున్నట్లు అంచనా. ఎన్పీసీఐ జులై గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం 338 బ్యాంకులు యూపీఐ లావాదేవీల్లో పాలుపంచుకున్నాయి. 628.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.10,62,991.76 కోట్లు. 2021 జులైలో లావాదేవీల సంఖ్య 324 కోట్లు కాగా, విలువ రూ.6,06,281.14 కోట్లే. అంటే ఏడాది వ్యవధిలో లావాదేవీల సంఖ్య రెట్టింపు కాగా.. విలువ రెట్టింపునకు కాస్త తక్కువగా ఉంది.
యూపీఐ ప్రధాన లక్ష్యం నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం. యూపీఐ లావాదేవీల్లో 50 శాతం వరకు రూ.200లోపు మొత్తానివే ఉంటున్నాయి. టీ తాగి రూ.10 చెల్లించాలన్నా.. యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీ2పీ), వ్యక్తుల నుంచి వ్యాపారులకూ (పీ2ఎం) నగదు బదిలీకి ఎన్నో యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో యూపీఐ సేవలపై రుసుములు, దానిపై జీఎస్టీ విధిస్తే.. వినియోగదారులు మళ్లీ నగదు చెలామణికి మొగ్గు చూపుతారని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. కొద్దిరోజులకే యూపీఐపై ఎలాంటి ఛార్జీలూ వసూలు చేసే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
UPI is a digital public good with immense convenience for the public & productivity gains for the economy. There is no consideration in Govt to levy any charges for UPI services. The concerns of the service providers for cost recovery have to be met through other means. (1/2)
— Ministry of Finance (@FinMinIndia) August 21, 2022