వివాదాలు ఉంటే ఆర్జీవీ బాగుంటాడు..వివాదాలు లేకపోతే ఆర్జీవీ అస్సలు బాగుండడు. కనుక ఆయనకు కొత్త తగాదాలు ఇష్టం..పాత శత్రువు ఒక్కడున్నా చాలు ప్రేమ.. ముంబయ్ మాఫియా అన్నవి ఆయనకు ఇష్టమయిన వస్తువులు..వీటితో పాటు పేలే తుపాకి.. కొట్టుకు చచ్చే గ్యాంగ్ స్టర్స్ ఇవన్నీ తన జీవితంతో మమేకం అయి ఉన్నాయి. నిజమయిన హీరోయిజం అదే ! వీధుల్లో దుమ్ము రేపి కొట్టుకోవడం.. కానీ మన హీరోలకు అవి నప్పవు మరియు నచ్చవు. కనుక ఆర్జీవీ కి స్టార్ హీరోలు అక్కర్లేదు.
రంగీలా లాంటి సినిమా వచ్చి ఎంత కాలం అయింది.. ఆర్జీవీ విశాఖలో ఏవో వెతికాడు..ఆ మాటకు వస్తే ఊర్మిళతో ఓ పెద్ద ప్రయోగమే చేశాడు. నా సినిమాకు స్టార్లు అక్కర్లేదు అని చెప్పే దమ్మున్న డైరెక్టర్ ఒక్కడే.. ఇవాళ ఆయన పుట్టిన్రోజు.. అంటే పండుగ రోజు.. హ్యాపీ బర్త్ డే..నేను సినిమాకు ఏం నేర్పాను అని అంతా మాట్లాడుతుంటారు కానీ సినిమా నాకు ఏం నేర్పింది అన్నదే ఓ ఫైనల్ థాట్ కావాలి అని అంటాడు. సినిమాలు ఫెయిలయిన ప్రతిసారీ ఆర్జీవీ ఆనందిస్తాడు. డబ్బులు పోయాయి అన్న బాధ ఉండదు. ఆయన నిర్మాత అయినా సరే ! నా చేతిలో లేని వాటిపై నాకు ఎలాంటి ప్రేమ కానీ అధికారం కానీ ఉండకూడదు అని చెబుతాడు. ఆర్జీవీ ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా కాలం అయింది..ఈ మాటే ఆయనకు చెప్పండి నవ్వుతాడు. నేను పట్టించుకోని వాటి గురించి మీరు అడిగితే నేనేం చెప్పగలను అని నవ్వుతాడు. అంత కాన్ఫిడెన్స్ ఓ డైరెక్టర్ కు ఉండడం అసాధ్యం కూడా !
ఒక జీవిని పోలి మరో జీవి ఉండడం అరుదు. మండుతున్న ఎండల్లో వస్తున్న పుట్టిన్రోజు ఇది..ఈ ఎండలో ఆయనను పోలిన మనిషి, ఆయనను పోలిన వ్యక్తిత్వం ఎక్కడ వెతకడం. అయినా ఆ ప్రయత్నమేదో చేయాలి. ఇంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు కదా ! వీళ్లకెందుకు భయాలు పోవడం లేదు. ఓ మామూలు కెమెరాతో కూడా సినిమాలు తీయవచ్చు అని నిరూపించిన ఆర్జీవీకి
ఇంకొంత కాలం సినిమా తప్ప మరో పిచ్చి ఉండకూడదనే కోరుకోవాలి. కోరుకుంటాను. సినిమా అనేది ఇంటెన్షన్.. నా ఇంటెన్షన్ మీకు నచ్చాలని రూలేం లేదు కదా! అని ఓ అర్థవంతం అయిన మాట చెప్పడం ఒక ఆర్జీవీకే సాధ్యం.
డబ్బులుంటే బాహుబలి వస్తుంది. స్టార్లుంటే ట్రిపుల్ ఆర్ వస్తుంది. ఏమీ లేకపోయినా సరే సినిమా పుట్టించవచ్చు అని నిరూపించాడు. అందుకే ఆయనంటే మాకు గౌరవం అండి..ఆయనేం చెప్పినా మేం వింటాం అని రాజమౌళి లాంటి వారు ఒప్పుకుని తప్పుకుంటారు. ఇండస్ట్రీ చేసుకున్న పాపం ఆర్జీవీ అంటే నవ్వుతాడు. పుణ్యం అంటే తిడతాడు. వద్దు నా దృష్టిలో ఎక్కువ కాలం చెడును మాత్రమే జనం గుర్తు పెట్టుకుంటారు కనుక మీరు నన్ను తిట్టండి ఏం కాదు అని కూడా అంటాడు.
ఇప్పటికీ ఎప్పటికీ అతడొక ప్రత్యేకం.. అతడొక ఆకాశం అని రాయడం అతి అవుతుంది కనుక రాయను.
– రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి…