ఆరాధనీయ స్థలాలు..స్మరణీయ స్థావరాలు.. అర్థం ఎంతో ! కానీ మమేకం కాని తత్వం ఒకటి మనిషిలో దాగి ఉంది. ముగ్ధ మనోహర తత్వం గురించి విన్నానే ! అది నడి రేయి పంచిన హాయిలో ఉంది. నగ్న దేహ దారులలో ఉంది..చిత్త భ్రాంతిలో కూడా ఉంది.. కొన్ని సార్లే ఈ విఫలతను ప్రేమిస్తూ ఉండాలి. కొన్ని సార్లు అయినా సంబంధిత ఆపాదనకు జీవితం సిద్ధం కావాలి. జీవితం అనగా నిషిద్ధం నుంచి విరుద్ధం వరకూ అని నిర్ణయిస్తూ పోతే చాలు.. అటువంటి ఆనవాళ్లు కొన్ని ప్రయాణాన దొరికితే ఇంకా మేలు. ముందున్న కాలం ముందున్న మనిషి ఏకాంత ప్రవాహాల్లో ఉండే స్త్రీ దేహం మరియు ఆ కాంతి పర్వం అన్నీ అన్నీ కూడా విశిష్టం అనుకునే ఆరాధన నుంచి పొంది ఉండాలి. విభిన్నతను పొంది ఉండాలి. విశ్వ జనీన తత్వం ఒకటి దేహాల కలయిక నుంచి పొంది ఉండాలి. దేహ దారుల్లో రాసుకున్న ప్రేమ కావ్యం ప్రకృతి పై ఉంచిన చిత్త భ్రాంతిని తొలగించేందుకు సహకరించాలి. ఆ తరహా ఆనందాలను సమీకరిస్తే మేలు ఇవాళ ! అదే నడిజాము రాత నేర్పింతే ఇంకా మేలు ! అలిఖిత హాయి కూడా !
మనుషులు అంతా ప్రకృతికి రుణపడి లేరు. ఇకపై ఉండరు కూడా ! దేహ శ్వాసల చెంత ప్రకృతి పర్వం ఒకటి విస్తరించి ఉంది అన్న విజ్ఞత లేని వాళ్లకు రాత్రి ఏదయినా ఓ శాపం ఇచ్చి వెళ్లాలి. లేదా రాత్రి కొన్ని విషాదాలు కళ్ల లోగిళ్లలో నలిగి నలిగి ఉండాలి. కనీస స్పృహ లేని మనుషులు ప్రకృతి ఆజ్ఞను పాటించడం లేదు. ప్రేమ పూర్వక ప్రతిపాదనలు ఏవీ అంగీకరించడం లేదు. జీవితేచ్ఛలు అన్నీ నీటి రాతలు అని తేలాక, మనిషి ఓ అభద్రత నుంచి భద్రం అయిన జీవితం కోసం చేసే అన్వేషణే ఓ వాస్తవ విరుద్ధం. ఈ తరహా అన్వేషణను నిషిద్ధం చేస్తే చాలు. జీవితాలు అన్నీ బాగుంటాయి.
మనవి చేస్తూ ఉంటాడు ప్రకృతికి..మనవి చేస్తూ ఉంటాడు ప్రకృతితో మమేకం అయిన లేదా ప్రకృతికి సమీపం అయిన స్త్రీ దేహానికి.. అందుకే ..ప్రాణమైనా ప్రేమైనా ఏదీ నీది కాదు..నేలైనా నింగైనా ఏవీ నీతో రావు.. నీకోసం నువ్వు అంతే ! వద్దు నువ్వు నీ వరకే నువ్వు .. ఇందాక చెప్పాగా ప్రేమలో ప్రేమ లేదు..కవిత్వంలో కవిత్వం లేదు..తత్వంలో తత్వం లేదు! తత్వమ్ అసి అని అంటే ఒప్పుకోను..ఉన్నదంతా తామసి మాత్రమే ! నలుపెక్కిన నీ కళ్లు చెబుతోన్న అధివాస్తవికత ఇదే ! వెళ్లు నేలకో మొక్కు మొక్కు ఇప్పుడనే కాదు ఎప్పుడూ నీ విషయంలో తప్పులన్నవి చేయనని..! నీ అనగా ప్రకృతి విషయంలో.. నీ అనగా నీ వరకూ అందించే ప్రేమ విషయంలో కూడా !
నింగికో ప్రేమలేఖ పంపు నాపై ఒకింత జాలి చూపి కరుణారుణ కిరణాలు ప్రసరించమని..మేఘానికో సందేశం ఇవ్వు వలపు వాకిట పన్నీటి చినుకులు చిలకరించమని.. కాసిన్ని ప్రేమాక్షితలు పంపమని..మట్టి పరిమళాలకేం కానీ వాటిని దేహం నిండా నింపుకోవాల్సిన పరిణితి నీదే అని గుర్తించు.. ఇదిగో ఇలా సంభాషించు..ఈ నేలా నాదే..ఈ నింగీ నాదే..వీటి పరిరక్షణ బాధ్యతా
నాదే అని.! అప్పుడే నిన్ను నమ్ముతా నువ్వొక ప్రకృతి ఆరాధకుడివని!
శ్రీకాకుళం దారుల నుంచి…