అప్పులు తీర్చిన అప్పాలు.. మన పెద్దపల్లి తల్లుల సక్సస్ ఫుల్ స్టోరీ..!

-

పెళ్లిలో భోజనాలు ఎంత ముఖ్యమో.. తర్వాత పెట్టే సారె కూడా అంతే ఇంపార్టెంట్.. సారె ఘనంగా ఇవ్వాలని చాలామంది అనుకుంటారు. వీటికోసం ఇంట్లో కాకండా.. బయట ఆర్డర్లు ఇస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా పెళ్లిళ్లకు ఇప్పుడు సుల్తానాపూర్ నుంచే సారె వెళ్తుంది. భారీ సైజుల్లో లడ్డూలు, సకినాలు, అరిసెలూ చేస్తుంటారూ ఈ మహిళలు.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, ఎలిగేడు మండలం, సుల్తాన్‌పూర్‌లో కొందరు మహిళలకు పెళ్ళిళ్లకు భారీ సైజులో సారెలు తయారుచేస్తున్నారు. లడ్డూ కిలో పరిమాణంలో ఉంటే, కజ్జికాయ ఒక్కోటి అర కిలో ఉంటుంది. సకినాలైతే ఏకంగా 32 వరుసల్లో పెద్ద చక్రాల్లా ఉంటాయి. గ్రామానికి చెందిన సుభాషిణి, సుజాత, రమాదేవి ఖాళీ సమయంలో ఏదైనా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని 13 ఏళ్ల కిందట నిర్ణయించుకున్నారు.

ఆ సమయంలో కాగితపు విస్తర్ల తయారీ గురించి ఆలోచించారు. కానీ దానికి భారీ పెట్టుబడి అవసరం. కానీ వారిదగ్గర అంత డబ్బు లేదు. వారికొచ్చిన రెండో ఆలోచనే భారీ సైజు పిండి వంటల తయారీ. పూర్వం రోజుల్లో భారీ సైజులో వంటకాలు చేసేవాళ్లు కానీ కాలం మారేకొద్ది అంత సైజు వంటకాలను చేయడం తగ్గించారు. వీళ్లు ఈ పాయింట్ పట్టుకుని బిజినెస్ స్టాట్ చేశారు.

ఒక్కో పిండి వంట తయారీలో నైపుణ్యం ఉన్నవారిని గుర్తించి 10 మంది మహిళలు సంఘంగా ఏర్పడ్డారు. మొదట్లో చిన్న మొత్తంలోనే ఆర్డర్లు వచ్చేవి. అయినా వెనకడుగు వేయలేదు. అధైర్య పడలేదు. ఆర్డర్‌ ఏ స్థాయిలో వచ్చినా నాణ్యమైన నెయ్యి, బాదం, జీడిపప్పు, సన్నబియ్యం, వంట నూనె… మొదలైనవి వినియోగించడంతోపాటు రుచి, శుభ్రత విషయంలోనూ నాణ్యమైన ప్రమాణాలు పాటించేవారు.

ఆ ఆర్డర్ తో తిరిగిన దశ

ఆ సమయంలో వేములవాడకు చెందిన ఓ ధనిక కుటుంబం నుంచి పెళ్లి సారె కోసం భారీ ఆర్డర్‌ వచ్చింది. దాంతో వీరి దశ తిరిగింది. అక్కడ వాటి రూపం, రుచి చూసిన వాళ్ల ద్వారా ఇతర జిల్లాలకూ, రాష్ట్రాలకూ వీరి పిండివంటల పేరు మారుమోగింది. గరిజ, బెల్లం అరిసెలూ, నువ్వుల లడ్డూ, మురుకులు, చెగోడీలూ, గవ్వలు.. ఇలా పలు రకాల పిండి వంటలు చేయడంలో వీళ్లు ప్రత్యేక గుర్తింపు సాధించారు.

వీళ్లు పిండివంటలను కట్టెలపొయ్యుమీద చేస్తారు. ఒక్క సంఘంతో మొదలైన ఈ బాహుబలి వంటకాల తయారీని ఇప్పుడు గ్రామంలో ఏడు మహిళా సంఘాలు చేస్తున్నాయి. ఒక్కో సంఘంలో 15-20 మంది సభ్యులుంటారు. కలిసి పనిచేస్తూ, సమానంగా లాభాల్ని పంచుకుంటారు.
వీరి దగ్గర గ్రామంలో మరో 200 మంది మహిళలూ ఉపాధి పొందుతున్నారు. వీరికి వచ్చే ఆర్డర్లు రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకూ ఉంటాయి.

పెళ్లిళ్ల సీజన్‌లో నెలకు ప్రతి సంఘానికి రూ.10లక్షలకు తగ్గకుండా ఆర్డర్లు వస్తాయట. ఇక్కడ తయారైన వంటకాలు అమెరికా, ఇంగ్లండ్‌లకూ పంపిస్తున్నారంటే..క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మీరే ఆలోచించండి.. రెండేళ్ల కిందట గవర్నర్‌ తమిళసై ఈ జిల్లాకు వచ్చినపుడు సుల్తాన్‌పూర్‌ వంటకాల్ని రుచి చూసి మహిళల్ని ఎంతో మెచ్చుకున్నారు.

అప్పులు బాధ తీరింది..

గ్రామంలో దాదాపు అన్నీ వ్యవసాయ కుటుంబాలే. ఒకప్పుడు సాగు కోసం, పిల్లల పై చదువులకు, పెళ్లిళ్లకు అప్పులు చేయాల్సి ఎంతో చితికిపోయారు. మహిళల ఆర్థిక విజయంతో అప్పుల్లేకుండా వ్యవసాయం చేసి అక్కడ లాభాల్ని సంపాదిస్తున్నారు. చదువుల కోసం పిల్లల్ని ధైర్యంగా నగరాలూ, విదేశాలకు పంపిస్తున్నారు. పెళ్లిళ్లకు అప్పు చేయాల్సిన అవసరమూ లేదిప్పుడు. సుల్తాన్‌పూర్‌ ఇప్పుడు అప్పాల సుల్తాన్‌పూర్‌గా, అప్పుల్లేని గ్రామంగా మారిందంటే ఆ ఘనత మహిళలదేనంటున్నారు అక్కడి గ్రామస్థులు.

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. ఐకమత్యంగా అందరిని కలుపుకుంటూ..నేడు ఇంత పేరు సాధించిని ఈ తల్లులు ఎంతోమందికి ఆదర్శం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version