మా ఇంట్లో దెయ్యం ఉంది.. ఆ రూమ్ లో పడుకోవాలంటే ఇప్పటికీ వణుకే..!

ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి. ఈమె గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. కలెక్టర్ గానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది ఆమ్రపాలి. సోషల్ మీడియాలోనూ ఆమ్రపాలి గురించి నెటిజన్లు ఎక్కువగా చర్చించుకుంటారు. అందుకే ఆమ్రపాలి ఏది మాట్లాడినా సెన్సేషనే. ఈ మధ్య ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమ్రపాలి ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు.

వాళ్ల ఇంట్లో దెయ్యం ఉందట. ఆ దెయ్యం ఉన్న రూమ్ లో పడుకోవాలంటే తనకు చాలా భయమట. ఆగస్టు 10 న వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణానికి పునాదిరాయి వేసి 133 ఏళ్లు అయిన సందర్భంగా.. తను ఉంటున్న ఆ చారిత్రక భవనం గురించి కొన్ని భయంకర నిజాలు వెల్లడించింది.

“జార్జ్ పామర్ అనే వ్యక్తి భార్య వరంగల్ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. జార్జ్ పామర్ ఎవరు? అని కొన్ని నెలలు మేము వాళ్ల మీద పరిశోధన చేశాం. దీంతో ఆయన నిజాం హయాంలో గొప్ప ఇంజినీర్ అని తెలిసింది. ఆయన సంతకంతో ఉన్న పేర్లు కూడా మాకు దొరికాయి. 1952 నుంచి కలెక్టర్లంతా ఆ బిల్డింగ్ లోనే ఉంటున్నారు.

నేను కలెక్టర్ గా ఈ జిల్లాకు వచ్చిన తర్వాత చాలా మంది గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు నాకు ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. దాంతో పాటుగా కలెక్టరేటు బిల్డింగ్ గురించి ఓ భయంకరమైన నిజం చెప్పారు. బిల్డింగ్ మొదటి అంతస్తులో దెయ్యం ఉంది అని చెప్పారు. అక్కడ ఎప్పుడూ పడుకోవద్దు అని నాకు చెప్పారు. నేను ఫస్ట్ ఫ్లోర్ వెళ్లి చూశాను. ఆ రూమ్ అంతా చిందర వందరగా ఉండటంతో దాన్ని అంతా క్లీన్ చేపించి రూమ్ లోని ఫర్నీచర్ అంతా సెట్ చేపించా. రూమ్ అంతా బాగుంది. కానీ.. నైట్ వెళ్లి అక్కడ పడుకోవాలంటే మాత్రం భయమే..” అంటూ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నది ఆమ్రపాలి.