విశ్వాసానికి మరోపేరు… మరోసారి!

-

శునకం.. నమ్మకానికి, విశ్వాసానికి ఇంకోరూపు. ఇది మన నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోవేల సార్లు రుజువైన సత్యం.  ఈవేళ మరోసారి తనజాతి గొప్పతనాన్ని చాటిచెప్పింది.

కేరళ.. రాష్ట్రమంతా ప్రస్తుతం వర్షాలతో, వరదలతో మునిగిపోతోంది. రాష్ట్రచరిత్రలోనే ఇంతటి భారీవిపత్తు ఎప్పుడూ ఏర్పడలేదు. ఈ వరదలతో 37మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 35వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అది రాత్రి 3 గంటల సమయం.. ఇదుక్కి జిల్లాలోని కంజికులి గ్రామంలోని తన యింట్లో గాఢనిద్రలో ఉన్నారు మోహనన్ కుటుంబం. సడన్‌గా అతనికి మెలకువ వచ్చింది. కారణం తమ పెంపుడుకుక్క రాకీ మొరగడమే. సరే… ఈ టైమ్‌లో ఇది మామూలేననుకుంటూ మళ్లీ ముసుగుతన్నాడు మోహనన్. కానీ, రాకీ అరుపులు అంతకంతకూ ఎక్కువై ఏడుపులోకి దిగాయి. ఇదేదో తేడాగా ఉందని భావించిన ఆయన లేచి బయటకు వచ్చాడు. ఏమైందని కుటుంబసభ్యులందరూ కూడా ఆయనను అనుసరించారు.

ఎదురుగా మహోగ్రరూపంలో కదిలివస్తోంది వరద. తనదారికి అడ్డుగాఉన్న ఇల్లూవాకిలి,  చెట్లూచేమలు, గుట్టపుట్టాలన్నింటినీ తనలో కలిపేసుకుంటూ మరో నిమిషంలో మోహనన్ ఇంటిని కబళించడానికి దూసుకోస్తోంది.

గడగడా వణికిన కుటుంబం, రాకీతో సహో ఒక్క ఉదుటున, ఉన్నపాటున దూరంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. మరునిముషంలో ఇళ్లు వరదలో కలిసిపోయింది.

‘‘మా రాకీ గనుక అరవకుంటే ఈపాటికి మేమంతా పైలోకాలకు చేరేవాళ్లం’’ అని మోహనన్ తెలిపాడు రాకీని కౌగలించుకుని. అయితే ఈ దుర్ఘటనలో అదే ఇంట్లో పై అంతస్థులో ఉంటున్న ముసలి దంపతులు మాత్రం ఇంటితోపాటు వరదలో కొట్టుకుపోయారు. నిజానికి వారి సొంతిల్లు అక్కడికి కిలోమీటర్ దూరంలో పెరియార్ నది ఒడ్డునే ఉంది. వరద ముప్పుందని అధికారులు అప్రమత్తం చేయడంతో మోహనన్ ఇంట్లోకి అద్దెకు వచ్చారని 24ఏళ్ల వాళ్ల మనుమడు చెప్పాడు. వాళ్లతో ఉంటున్న తన భార్య, ఏడాది వయసున్న కూతుర్ని మాత్రం గ్రామస్థులు కాపాడగలిగారు.

ప్రస్తుతం మోహనన్ కుటుంబం పునరావాసకేంద్రంలో ఆశ్రయం పొందుతోంది. పెరియార్ డ్యామ్ గేట్లు ఎత్తేయడంతో వరద పోటెత్తి, ఇదుక్కి జిల్లాను పూర్తిగా నాశనం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news