వార‌ణాసిలో ముస్లింల ఇండ్ల‌ను కూల్చేస్తే.. హిందువుల ఆల‌యాలు బ‌య‌ట ప‌డ్డాయ‌ట‌..? నిజ‌మేనా..?

-

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో చేప‌ట్టిన కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ కోసం రోడ్ల విస్త‌ర‌ణలో భాగంగా 80 మంది ముస్లింల ఇండ్ల‌ను కొనుగోలు చేసి కూల్చేశార‌ని.. ఈ క్ర‌మంలోనే ఆ ఇండ్ల కింద 45 పురాత‌న ఆల‌యాలు బ‌య‌ట ప‌డ్డాయ‌ని.. సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియాలో అస‌లు వార్త‌ల క‌న్నా.. పుకార్లే ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతున్నాయ‌నే విష‌యం తెలిసిందే. దీంతో జ‌నాల‌కు అస‌లు వార్త ఏది, న‌కిలీ వార్త ఏది.. అని క‌నిపెట్ట‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. అయితే అస‌లు వార్త‌ల‌తో ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌డం లేదు. కానీ నకిలీ వార్తలు, పుకార్ల వ‌ల్ల ఇప్ప‌టికే చాలా మంది ప‌లు చోట్ల ప్రాణాల‌ను కోల్పోయారు. ఈ క్ర‌మంలో న‌కిలీ వార్త‌ల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆయా సోష‌ల్ మీడియా సైట్లు కూడా త‌మ వంతు కృషి చేస్తున్నాయి. అయినప్ప‌టికీ ఆ వార్త‌లు ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా మరొక న‌కిలీ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ అదేమిటంటే…

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో చేప‌ట్టిన కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ కోసం రోడ్ల విస్త‌ర‌ణలో భాగంగా 80 మంది ముస్లింల ఇండ్ల‌ను కొనుగోలు చేసి కూల్చేశార‌ని.. ఈ క్ర‌మంలోనే ఆ ఇండ్ల కింద 45 పురాత‌న ఆల‌యాలు బ‌య‌ట ప‌డ్డాయ‌ని.. సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాదు, ఈ వార్త‌లు నిజ‌మ‌ని భావించేలా కొన్ని వీడియోల‌ను కూడా సోష‌ల్ మీడియాలోకి వ‌దిలారు. దీంతో చాలా మంది ఈ వార్త నిజ‌మే అని న‌మ్మారు. అయితే వాస్త‌వానికి ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. మ‌రి నిజం ఏమిటంటే…

ప్రధాని మోడీ కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ ప్రాజెక్టుకు 2019 మార్చి 8వ తేదీన శంకుస్థాప‌న చేసిన విష‌యం నిజ‌మే. అందులో భాగంగానే ఆయ‌న దీన్ని త‌న క‌ల‌ల ప్రాజెక్టుగా భావిస్తున్నారు. గంగాన‌ది నుంచి 18వ శ‌తాబ్దం నాటి శైవ క్షేత్ర‌మైన కాశీ విశ్వ‌నాథ్ ఆల‌యానికి భ‌క్తుల రాక‌పోక‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది నిజ‌మే. అందులో భాగంగానే ప్ర‌త్యేకంగా నియ‌మించిన కాశీ విశ్వ‌నాథ్ స్పెష‌ల్ ఏరియా డెవ‌లప్‌మెంట్ బోర్డు ఆధ్వ‌ర్యంలో ఈ ప్రాజెక్టు ప‌నులు కూడా కొన‌సాగుతున్నాయి.

అయితే ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం కొన్న‌ది ముస్లింల ఇండ్ల‌ను కాదు..204 మంది హిందువుల ఇండ్ల‌ను. అవును నిజ‌మే. వాటిల్లో ఇప్ప‌టి వ‌రకు 183 ఇండ్ల‌ను కూల్చివేశారు. ఈ క్ర‌మంలో ఆ ఇండ్ల కింద 23 ఆల‌యాలు బ‌య‌ట ప‌డ్డాయి. ఈ విష‌యాల‌ను సాక్షాత్తూ ప్రాజెక్టు అధికారులే మీడియాకు వెల్ల‌డించారు. అయితే ఒక ఆల‌యం స‌మీపంలో మ‌సీదు కూడా ఉంద‌ట‌. కానీ దాన్ని ట‌చ్ కూడా చేయ‌లేద‌ని అధికారులు తెలిపారు. అంతేకానీ.. అస‌లు ముస్లింల ఇండ్లు కూల్చార‌ని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్తల్లో నిజం లేద‌ని అధికారులు చెబుతున్నారు. క‌నుక ఇప్ప‌టికైనా సోష‌ల్ మీడియాలో క‌నిపించే వార్త‌ల‌ను న‌మ్మే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించ‌డం బెట‌ర్‌. లేదంటే న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news