అనేక రాజకీయ వివాదాలు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది..గత కొంత కాలంగా అధికార పార్టీకి..ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మధ్య నెలకొన్న వివాదాలు సర్థుమనగడంతో.. మళ్లీ ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది..ఈ నేపథ్యంలో ఈ నెల 28న రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ భేటీ కానున్నారు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం తీసుకోనున్నారు ఎస్‌ఈసీ..గతంలో ఎన్నికల వాయిదా వేయడంపై అభ్యంతరం చెప్పిన అధికారపార్టీ స్టాండ్‌పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది..అయితే గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని గతంలోనే ఎస్‌ఈసీకి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.