ఈ అలంకారంలో దుర్గాదేవిని దర్శించుకుంటే దరిద్రాలు పోతాయి..!!

దసరా పండుగ అంటే నవరాత్రులు..ఒక్కోరోజు అమ్మవారిని ఒక్కో అలంకరణలో తయారు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు.ఒక్కో ప్రాంతంలోని ఆచారాలను బట్టి అక్కడ అమ్మవారి అలంకారాలు ఒక్కోలా ఉంటాయి..మన తెలుగు రాష్ట్రాలకు అమ్మవారు అంటే విజయవాడ కనకదుర్గమ్మ..శరన్నవరాత్రుల్లో మొదటి రోజు దుర్గమ్మని ‘స్వర్ణ కవచాలంకృత దేవి’గా అలంకరిస్తారు. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు.

ఒకప్పుడు విజయవాడని విజయవాటిక అని పిలిచేవారు. అర్జునుడు ఇక్కడ శివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అర్జునుడి తపస్సుకి మెచ్చిన శివుడు తన పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకనే ఈ ప్రాంతానికి విజయవాటిక అన్న పేరు వచ్చింది.ఒకప్పుడు ఈ విజయవాటికను మాధవవర్మ అనే రాజు పాలించేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. మాధవవర్మ పాలనలో రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. ధర్మం నాలుగు పాదాలా నడిచేది. అలాంటి సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. మాధవవర్మ కుమారుడు ఒకసారి రథం మీద తిరుగుతుందగా…ఆ రథం కింద పడి ఓ బాలుడు చనిపోయాడు.

పొరపాటున జరిగినా కూడా అమాయకుడైన ఓ పిల్లవాడి ప్రాణాలను బలిగొన్నందుకు రాజుగారు తన కొడుకని కూడా చూడకుండా మరణశిక్ష విధించారు. మాధవవర్మ నిజాయితీకి అమ్మవారు చాలా సంతోషించి ఆ రాజ్యం అంతా బంగారు వర్షాన్ని కురిపించింది. అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గగా పిలుస్తున్నారు..దసరా మొదటి రోజు అమ్మవారిని బంగారపు ఆభరణాలతో అలంకరించి..ఆమెను స్వర్ణ కవచాలంకృతగా పూజిస్తున్నారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని చూసినా, పూజించినా ఇంట్లో ఉన్న దరిద్ర్యమంతా తీరిపోతుందని భక్తుల నమ్మకం..

శ్రీ దుర్గా దేవి కవచం ..

శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ |
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ ||
అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామన్త్రం చ యో జపేత్ |
న చాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ ||
ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ |
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ||
సుగన్ధా నాసికం పాతు వదనం సర్వధారిణీ |
జిహ్వాం చ చణ్డికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా ||
అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ |
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ ||
కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ |
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ ||
ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా |
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోస్తు తే ||