కోవిడ్ 19 తెచ్చే సమస్యల్లో రక్తం గడ్డ కట్టడం కూడా ఒకటి. ఇప్పటివరకు సిరలలో రక్తం గడ్డ కట్టడం గురించి ఎక్కువగా వార్తలు వచ్చాయి. శరీరంలో ఇతర భాగాల నుండి చెడు రక్తం సిరల నుండి గుండెకి వెళ్తుంది. గుండె నుండి శరీర భాగాలకు మోసుకువెళ్ళే వాటిని ధమనులు అంటారు. ఆక్సిజన్ ని శరీర భాగాలని తీసుకువెళ్ళే ఈ ధమనుల్లో రక్తం గడ్డ కట్టడం ప్రమాదానికి దారి తీస్తుంది. ధమనుల్లో రక్తం గడ్డ కడితే ఏమవుతుంది? ఎలాంటి లక్షణాలుయ్ కనిపిస్తాయనేది తెలుసుకుందాం.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చాలా మంది యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ధమనుల్లో రక్తం గడ్డ కట్టడం కారణంగా ఒక్కోసారి అవయవాలనే తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
రక్తం గడ్డ కట్టడానికి కారణాలు
నిజంగా ఇదే కారణం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కరోనా సోకడంతో రక్తం చిక్కగా మారుతుంది. అది ఎక్కువై రక్తం గడ్డ కట్టే పరిస్థితులకి దారి తీస్తుంది.
కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే ఇలా జరుగుతుందా?
లేదు. చాలా మటుకు కోవిడ్ నుండి రికవరీ అయ్యాక 2-3వారాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఏర్పడుతున్నాయి. అందువల్ల లక్షణాలని తొందరగా పసిగట్టలేక వైద్యం ఆలస్యం అయిపోయి ప్రాణాలకి ప్రమాదంగా మారుతుంది.
లక్షణాలు
మొదటగా అవయవాల్లో విపరీతంగా నొప్పి కలుగుతుంది. చేతి వేళ్ళు, కాలి వేళ్ళు తిమ్మిర్లు ఏర్పడతాయి. మూడవ లక్షణంలో అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. అంటే పక్షవాతంలా అని చెప్పవచ్చు. రక్తం సరిగ్గా సరఫరా అవదు కాబట్టి పాలిపోయినట్టు కనిపిస్తారు.
ఏ సమయంలో వైద్యుడిని సంప్రదించాలి?
మొదట లక్షణాలు కనిపించిన 6-8గంటల్లో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఆలస్యం అవుతుంటే అనేక ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది.