చేతులు శుభ్రపరుచుకోవడానికి కూడా దినోత్సవం ఉందని మీకు తెలుసా.. ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలన్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వల్ల కరోనా చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందని నిరూపితం అయ్యింది. వ్యక్తిగత శుభ్రతలో అతి ముఖ్యమైనది చేతులు శుభ్రంగా కడుక్కోవడం. కరోనా రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో కానీ, ప్రస్తుతమైతే చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. ప్రపంచ చేతులు శుభ్రపరుచుకునే దినోత్సవమైన ఈరోజు చేతులు ఎలా కడుక్కోవాలో, ఏ టైమ్ లో శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం.

ఇంట్లో నుండి బయటకి వెళ్ళినపుడు మన చేతులు ఎక్కడెక్కడో తాకతాయి. మనకి తెలియకుండానే ముక్కు, నోరు, కళ్ళని ముట్టుకుంటూ ఉంటాం. అలాగే ఆఫీసుకి వెళ్ళినపుడు అక్కడ చాలా మంది తాకిన వస్తువులని, టేబుల్స్, కంప్యూటర్ తాకాల్సి ఉంటుంది. మరి ఇలాంటి టైమ్ లో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం..

ఒకరోజులో ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవడం అందరికీ మంచిది. దీనివల్ల ఒక్క కరోనానే కాదు ఇతర కలరా, ఎబోలా, సార్స్, హెపటైటిస్ ఈ వ్యాధుల వ్యాప్తిని ఆపుతుంది.

ఐతే ఏయే సమయాల్లో చేతులు కడుక్కోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఆహారం వండేముందు, అలాగే బోజనానికి ముందు. ఇంకా మీ పెంపుడు జంతువులని ముట్టుకున్నా, వాటికి ఆహారాన్ని తినిపించినా, జలుబుతో బాధపడుతూ ఊరికే మీ ముక్కుని తాకినా, గాయాలకి మందు రాసేముందు, రాసిన తర్వాత, బట్టలు ఉతికిన తర్వాత, టాయిలెట్ కి వెళ్ళొచ్చాక, ఇంకా చేతులు అపరిశుభ్రంగా అనిపించినపుడు ఖచ్చితంగా కడుక్కోవాలి.

ఆఫీసులో ఉన్నప్పుడు సబ్బు వినియోగించడం కష్టం అనుకుంటే శానిటైజర్ వాడడం మంచిది. ఐతే సబ్బు వాడేవారు లిక్విడ్ సో వాడితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలాగే కనీసం 20సెకన్ల పాటయినా చేతులు కడగాలి. అరచేతులతో పాటు వెనకవైపు కూడా శుభ్రం చేసుకోవాలి. వేళ్ళు, గోర్లు అని చూడకుండా శుభ్రపర్చుకోవాలి.