మహమ్మారి సమయంలో పిల్లల రోగనిరోధక శక్తి పెంచే ఆయుర్వేద మూలకాలు..

కరోనా మొదటి వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపలేదు. కానీ సెకండ్ వేవ్ లో చిన్నపిల్లలు కూడా ప్రభావితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడం చాలా అవసరం. పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మొదలగు వాటివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ప్రస్తుతం చిన్నపిల్లల్లో జీర్ణశక్తిని, జీవక్రియని పెంచి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే ఆయుర్వేద మూలకాల గురించి తెలుసుకుందాం.

తులసి

ఆయుర్వేద మూలకాల్లో రాణిగా పిలవబడే తులసిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, సి, కె పుష్కలంగా ఉంటాయి. జలుబు తగ్గించడంలో తులసి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మన ఇంట్లో పెంచుకునే ఈ మొక్కకి రోగనిరోధక శక్తిని పెంచే గుణం చాలా ఉంది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తులసి బాగా పనిచేస్తుంది.

పసుపు

భారతీయ వంటగదుల్లో సాధారణంగా వాడే పదార్థం. ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలు ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులని దూరం చేయడంలో సాయపడుతుంది. క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. గాయాల నుండి రక్తం కారుతుంటే గడ్డకట్టడానికి పసుపుని వాడతారన్న సంగతి తెలిసిందే.

అశ్వగంధ

రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో అశ్వగంధ చాలా ప్రముఖమైనది. మెదడు పనితీరును కూడా అశ్వగంధ మెరుగుపరుస్తుంది.

ఉసిరి

విటమిన్ సి అధికంగా గల ఉసిరి జలుబు, దగ్గు, గొంతునొప్పిని దూరం చేయడంలో కీలకంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జుట్టు సంరక్షణ, చక్కెర నిల్వలని నియంత్రించడం, ,కంటిచూపుని మెరుగుపర్చడంలో సాయపడుతుంది.