బాడీకి బ్లడ్ ఎంత అవసరమో.. ఆ బ్లడ్‌లో హిమోగ్లోబిన్ కూడా అంతే అవసరం. లేదంటే నీళ్లు ఎక్కువ కలిపిన పాలులా అవుతుంది రక్తం. రక్తంలో సరిపడా హిమోగ్లోబిన్ ఉంటే శరీరంలోని అన్నీ భాగాలకు ఆక్సిజన్ సరఫరా సజావుగా జరుగుతుంది. అందుకే హిమోగ్లోబిన్ తగినంత ఉండాలి. హిమోగ్లోబిన్ లోపిస్తే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత వంటి సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఈ ఆహారాలు తీసుకోండి..!
విటమిన్ సీ ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్లు హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి.. ముఖ్యంగా నారింజ, నిమ్మ, ద్రాక్ష ఇవి తింటూ ఉండండి. ఇంకా దానిమ్మలో ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మపండుతో చేసిన రసాన్ని ప్రతి రోజూ తాగితే బాడీకి మంచి పోషకాలు అందుతాయి. శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
ఆకుకూరలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అందులో ముఖ్యంగా పాలకూర, బచ్చలకూర ఇంకా మంచివి. పాలకూర రోజు వారీ ఆహారంలో తప్పకుండా తినాలి. పాల కూరను ఇతర కూరగాయలతో కూడా చేర్చి తినవచ్చు. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించడంలో ఎంతో తోడ్పడుతుంది. బచ్చలకూర తినడ వల్ల బాడీకీ రక్తంపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు బచ్చలకూరను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
బీట్రూట్ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా స్కిన్‌కు కూడా చాలా మేలు చేస్తుంది. స్కిన్ గ్లోయింగ్ ఉండాలంటే.. వారంలో రెండు సార్లు బీట్రూట్ రసం తీసుకుంటే చాలు..మంచి రిజల్ట్ ఉంటుంది.
ఇంకా మాంసం, చేపలు, సోయా ఉత్పత్తులు, గుడ్లు, ఖర్జూర పళ్లు, బ్రోకలీ, ఆకుపచ్చ బీన్స్, కాయలు, విత్తనాలు, వేరుశనగ నూనె వీటన్నింటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి హిమోగ్లోబిన్‌ను పెంచేందుకు తోడ్పడతాయి.
అసలు హిమోగ్లోబిన్ స్థాయి మీలో తక్కువగా ఉందా లేదా తెలుసుకోవాలి కదా.. అన్నింటికి లానే దీనికి కూడా కొన్ని సంకేతాలు ఉంటాయి..
హిమోగ్లోబిన్ స్థాయి తక్కువ ఉండే లక్షణాలు..
వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన
చర్మం లేతగా ఉండటం
అలసట
కండరాల బలహీనత
తరచుగా లేదా వివరించలేని గాయాలు
తరచూ తలనొప్పి
ఇలాంటివి మీలో ఉంటే.. ఓసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.! అలాగే పైన చెప్పిన ఆహారాలను మీ డైట్లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.