ఒక సినిమాలో బ్రహ్మానందం గారు ఇలా అంటారు. భార్యని ఉద్దేశిస్తూ ఏదైనా పండు రసం ఉంటే తీసుకురా అని. అపుడు కోవై సరళ చింతపండు రసం తీసుకువస్తుంది. అది తెలియక తాగుదామని నోట్లో పెట్టుకోగానే పుల్లగా అనిపించేసరికి ఇది చింతపండు రసమా అని అంటాడు. అపుడు మీరే కదండీ ఏదైనా పండు రసం అడిగారు, అందుకే చింతపండు రసం తీసుకొచ్చానని అమాయకంగా జవాబిస్తుంది.
ఆ టైమ్ లో అందరం నవ్వుకుంటాం. కామెడీ కోసం చింతపండు రసం తీసుకున్నారేమో గానీ దాని వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. చింతపండు రసం తాగడం వలన అనేక్ అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.
ముందుగా చింతపండు రసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కొద్దిగా చింతపండు తీసుకుని, దాన్ని ఉడకబెట్టిన నీటిలో వేసుకోవాలి. అప్పుడు రసం తయారవుతుంది. ఆ తర్వాత రుచి కోసం ఆ రసానికి తేనే కలుపుకుంటే మంచిది.
ఐతే చింతపండు రసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
బరువు తగ్గడానికి చింతపండు రసం బాగ ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకి తీసేస్తుంది. అంతే కాదు శరీరంలో కొవ్వు పెరగకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చింతపండు రసం బాగా ఉపయోగపడుతుంది. దీన్లో విటమిన్ సి ఉంటుంది. అందువల్ల చర్మం ఆకారం మారిపోకుండా కాపాడుతుంది.
ముఖ్యంగా జీర్ణసమస్యలని తగ్గిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. చింతపండు రసం తాగడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమై మలబద్దకం అనే సమస్య ఉండదు.
సో.. చింతపండు రసం అని తేలిగ్గా చూడకుండా మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఐతే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఏదీ అతిగా తీసుకోకూడదు. కాబట్టి తగినంతగా తీసుకోండి.