గ్రామీణ ప్రాంత వాసుల్లో నెలసరి పట్ల ఉండే అపోహలను తొలగించడంతోపాటు, మహిళలు పాత గుడ్డలకు బదులుగా శానిటరీ నాప్‌కిన్లను వాడాలని చాటి చెబుతూ.. వారిలో అవగాహన పెంచేలా ప్రవీణ్ కుమార్ సుంకరి అనే ఔత్సాహిక డైరెక్టర్ ఓ షార్ట్ ఫిలిం తీశారు. దాని పేరే గౌరి.. ది పెయిన్..
మహిళలకు నెలసరి వచ్చే విషయంలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో అనేక మూఢ నమ్మకాలు నెలకొని ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. నెలసరి రావడం అంటే.. అదేదో కీడు చేసేదిగా భావిస్తారు. ఆ సమయంలో వేటినీ ముట్టుకోనివ్వరు. పూలను, దేవున్ని, ఇంట్లోని కుటుంబ సభ్యులను, పచ్చళ్లను.. ఇలా దేన్నీ ముట్టుకోనివ్వవద్దని పెద్దలు చెబుతారు. అలాగే.. ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టం చేస్తారు. కానీ ఇవన్నీ మూఢనమ్మకాలే. ఎప్పటి నుంచో మన పెద్దలు వీటిని పాటిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి వచ్చే మహిళలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
అయితే నెలసరి వచ్చే మహిళల పట్ల గ్రామీణ ప్రాంత వాసుల్లో మార్పు తెచ్చేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఆ ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలను పారదోలే విధంగా సామాజిక కార్యకర్తలు పనిచేస్తున్నారు. దీంతోపాటు నెలసరి వచ్చిన సమయంలో చాలా మంది మహిళలు పాతగుడ్డలను వాడుతుంటారు. ఈ క్రమంలో వారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. దీంతో వారిని శుభ్రమైన శానిటరీ నాప్‌కిన్లను వాడేలా వారిలో స్వచ్ఛంద సంస్థలు అవగాహన పెంచుతున్నాయి.
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ప్యాడ్ మాన్ సినిమాలోనూ శానిటరీ నాప్‌కిన్ల ప్రాముఖ్యతను వివరించారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంత వాసుల్లో నెలసరి పట్ల ఉండే అపోహలను తొలగించడంతోపాటు, మహిళలు పాత గుడ్డలకు బదులుగా శానిటరీ నాప్‌కిన్లను వాడాలని చాటి చెబుతూ.. వారిలో అవగాహన పెంచేలా ప్రవీణ్ కుమార్ సుంకరి అనే ఔత్సాహిక డైరెక్టర్ ఓ షార్ట్ ఫిలిం తీశారు. దాని పేరే గౌరి.. ది పెయిన్.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు నెలసరి వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు.. అనే అంశాన్ని కూడా ఇందులో చక్కగా చూపించారు.. అలాగే నెలసరి వచ్చిన మహిళలు పాత గుడ్డలకు బదులుగా, శానిటరీ నాప్‌కిన్లను వాడాలని కూడా ఇందులో తెలిపారు. గౌరి అనే ఓ బాలిక శానిటరీ నాప్‌కిన్ల వాడకం గురించి తెలుసుకుని తన తల్లికి ఆ విషయాన్ని ఎలా చెప్పింది.. అనే కథాంశంతో ఈ షార్ట్ ఫిలిం తీశారు. ఈ క్రమంలోనే ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది..!