పండ్లు లేదా పాలు ఏవైనా సరే.. వాటిని వాడేముందు ఒకసారి అవి కల్తీ అయ్యాయో లేదో తెలుసుకుంటే బాగుంటుంది కదా.. అన్న ఉద్దేశంతో ఆ నలుగురు విద్యార్థులు రెండు రకాల పరికరాలను తయారు చేశారు.
మార్కెట్‌లోకి మనం వెళ్లగానే ఎదురుగా మనకు పండ్లు, కూరగాయలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ వాటిని కొని ఇంటికి తెచ్చుకుని తిందామనుకునే సరికి అవి పాడవుతాయి. లేదా వాటి టేస్ట్ డిఫరెంట్‌గా వస్తుంది. దీంతో వాటిని తినకుండా మనం పారేస్తాం. అయితే మనం కొనే పండ్లు లేదా పాలు కల్తీ అయ్యాయని మనకు ముందుగా తెలిస్తే అప్పుడు మనం వాటిని కొనం కదా. దీంతో అవి వేస్ట్ కాకుండా ఉంటాయి. అలాగే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. అయితే మరి.. వాటిలో కల్తీ జరిగిందని ఎలా గుర్తించడం..? అంటే.. ఇందుకు మనకు రెండు రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటి..? వాటిని ఎవరు తయారు చేశారు ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని ఎన్ఐఐటీకి చెందిన అభినందన్ భార్గవ, అల్ఫోన్స్ దాస్ ఆంటోనీ, రాహుల్ కుమార్, వర్షిణీ రాజ్ అనే నలుగురు విద్యార్థులు 2018లో గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేశారు. అయితే వారికి నిత్యం తమ కాలేజీ క్యాంటీన్‌లో పాలు లేదా ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నప్పుడు అనుమానం వచ్చేది. ఎందుకంటే.. చూసేందుకు అవి చక్కగానే కనిపించేవి. కానీ తాగి చూస్తే టేస్ట్ అదో రకంగా ఉండేది. దీంతో అవి కల్తీ అనే అనుమానం వారికి వచ్చింది. ఈ క్రమంలోనే వారి బుర్రల్లో ఒక ఐడియా కూడా మెదిలింది. అదేమిటంటే..
పండ్లు లేదా పాలు ఏవైనా సరే.. వాటిని వాడేముందు ఒకసారి అవి కల్తీ అయ్యాయో లేదో తెలుసుకుంటే బాగుంటుంది కదా.. అన్న ఉద్దేశంతో ఆ నలుగురు విద్యార్థులు రెండు రకాల పరికరాలను తయారు చేశారు. వాటిలో ఒకటి ఫ్రూట్ అనలైజర్. ఈ పరికరం అతినీలలోహిత కిరణాలు వెలువరుస్తుంది. దాంతో ఆ కిరణాలతో పండ్లను ఆ పరికరం స్కాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే పండ్లు బాగున్నాయా, వాటిని కెమికల్స్‌తో పండించారా, అవి కల్తీ అయ్యాయా, అన్న వివరాలను ఆ పరికరం వెంటనే చెప్పేస్తుంది. అందుకు కేవలం 3, 4 సెకన్ల సమయం మాత్రమే పట్టడం విశేషం. దీంతో మనం కొనే పండ్లను ఒకసారి చెక్ చేస్తే అవి బాగున్నాయో, లేదో మనకు ఇట్టే తెలిసిపోతుంది.
ఇక ఆ నలుగురు విద్యార్థులు తయారు చేసిన మరో పరికరం.. మిల్క్ అనలైజర్. పాలలో ఏవైనా కెమికల్స్ కలిపారా ? అవి నాణ్యంగా ఉన్నాయా, లేదా అన్న వివరాలను ఈ పరికరం తెలుపుతుంది. దీంతో పాలు బాగున్నాయా, లేదా అనే విషయం మనకు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే తెలుస్తుంది. తద్వారా మనం నాణ్యమైన పాలనే కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. అయితే ఈ విద్యార్థులు తయారు చేసిన ఈ రెండు పరికరాలు ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. ఈ ఏడాది జూలై నుంచి వీటిని వాణిజ్య పరంగా ఉపయోగంలోకి తేనున్నారు. ఈ నలుగురు కలిసి ఏర్పాటు చేసిన రావ్ టెక్ ల్యాబ్స్ అనే స్టార్టప్ కంపెనీ ద్వారా ఈ రెండు పరికరాలను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. అవి మనకు లభిస్తే.. ఇకపై పండ్లు, పాలు నాణ్యంగా ఉన్నాయా, కల్తీ అయ్యాయా అన్నది మనకు చాలా సులభంగా తెలుస్తుంది. దాంతో కల్తీలను కొంత వరకైనా అడ్డుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే ఆ పరికరాలు మనకు అందుబాటులోకి వచ్చేదాకా మాత్రం వేచి చూడాల్సిందే..!