డ్రస్సుల దగ్గర్నుంచి చెప్పుల దాకా కొత్తదనానికే ఓటేస్తున్నారు ఈతరం అమ్మాయిలు. సంప్రదాయానికి సృజనాత్మకతను, ఆధునికతను జోడిస్తూ ఫ్యాషన్ క్వీన్‌లా మెరిసిపోతున్నారు. అలాంటి ఫ్యాషన్ ప్రియుల నాడిని వెతికి పట్టుకుంది దిల్లీకి చెందిన లక్షీత గోవిల్. సంప్రదాయ చెప్పులకు మోడ్రన్ హంగులద్దుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అందుకే సామాన్యులే కాదు.. ప్రముఖ సెలబ్రిటీలూ ఈమె డిజైన్ చేసిన పాదరక్షలు ధరించడానికి పోటీపడుతున్నారు. తన క్రియేటివిటీతో దేశ, విదేశీ ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకుంటూనే.. మరోవైపు ఎంతోమంది సంప్రదాయ కళాకారులకూ ఉపాధి కల్పిస్తోన్న లక్షీత విజయ ప్రస్థానమిదీ..!
నేటి తరం అమ్మాయిలు ఫ్యాషన్ కి కట్టుబానిసలు. ముఖ్యంగా మ్యాచింగ్ అంటే వాళ్లకి ప్రాణం. జుట్టుకు వేసుకునే రబ్బర్ బ్యాండ్ నుంచి కాళ్లకు వేసుకనే చెప్పుల వరకు అన్నీ ఒకే రంగులో ఉండాలని ఆరాటపడుతుంటారు. ఓవైపు సంప్రదాయంగా ఉంటూనే మరోవైపు మోడన్ గా ఉండటానికి నేటి అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. అలాంటి అమ్మాయిల పల్స్ పట్టుకుంది దిల్లీకి చెందిన లక్షీత గోవిల్. ట్రెడిషన్ లా ఉంటూనే మోడన్ గా కనిపించే క్రేజీ చెప్పులు డిజైన్ చేసి అమ్మాయిల మనసు దోచేస్తోంది. ఈమె డిజైన్ చేసిన పాదరక్షలకు సెలబ్రిటీలు కూడా ఫిదాయే. తన క్రియేటివితో మన దేశంలోనే కాదు ఫారెన్ కస్టమర్ల మనసునూ దోచేస్తుంది లక్షీత.
సరైన ప్లానింగ్ ఉంటే సగం సక్సెస్ అయినట్టే అంటారు. లైఫ్ పై ఓ క్లారిటీ ఉంటే సక్సెస్ కావడం కూడా పెద్ద కష్టం ఏం కాదు. మనకేం కావాలో తెలిశాక దానికోసం కష్టపడటం పెద్ద విషయం కాదు. లక్షీతకు ఈ విషయం బాగా తెలుసు. లైఫ్ లో తాను ఏం కావాలనుకుంటోందో తనకు ఓ క్లారిటీ ఉంది. ఆ దిశగానే తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంది. దిల్లీలోని ‘పర్ల్ అకాడమీ’ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన లక్షీత.. అనుభవం కోసం Puma వంటి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లతో కలిసి పనిచేసింది. ఆపై ఉద్యోగానికి రాజీనామా చేసి తను అనుకున్న వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
లక్షీతకు చిన్న వయసు నుంచే క్రాఫ్ట్స్ తయారుచేయడమంటే మక్కువ. ఈ ఇష్టంతోనే క్యాండిల్స్, గ్రీటింగ్ కార్డులు, ఇతర వస్తువులు చేత్తో తయారుచేసి.. వివిధ అకేషన్స్‌లో తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతిగా ఇచ్చేది. ఇవి వాళ్లకెంతో నచ్చేవి. ఇదే కళను ఓసారి స్నీకర్స్కి అప్లై చేశానని, అదే తన కెరీర్‌ని మలుపు తిప్పిందంటోందీ ఫ్యాషనర్. ‘ఓసారి ఓ షాపులో అందంగా అలంకరించిన ఓ చెప్పుల జతను చూశా. అది నాకు చాలా నచ్చింది.
కానీ దాని ధర చాలా ఎక్కువ. అప్పుడనిపించింది.. ఇలాంటి చెప్పుల్ని తక్కువ ధరల్లోనే అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని! అనుకున్నదే తడవుగా నా చెప్పుల జతల మీదే ప్రయోగం మొదలుపెట్టా. విభిన్న డిజైన్లతో వాటిని అలంకరించుకొని కాలేజీకి వేసుకెళ్లేదాన్ని. అవి చూసి నా ఫ్రెండ్స్ తమకూ అలాగే చేసివ్వమని కోరేవారు. అయితే దీనిపై పూర్తిస్థాయి దృష్టి సారించింది మాత్రం 2014లోనే! అదే ఏడాది ‘ఫిజ్జీ గోబ్లెట్’ పేరుతో నా పాదరక్షల వ్యాపారం ప్రారంభించా..’ అంటూ చెప్పుకొచ్చిందీ యంగ్ ఆంత్రప్రెన్యూర్.
కొల్హాపురీ, జ్యుతీస్, స్నీకర్స్, శాండిల్స్, హీల్స్, ఫ్లాట్స్.. వంటి విభిన్న రకాల చెప్పులు తయారుచేస్తూ.. వాటిపై ఎంబ్రాయిడరీ, ప్రింట్ వర్క్, ఆరీ వర్క్.. వంటి సంప్రదాయ కళలతో హంగులద్దుతోంది. ‘రోజూ కొత్తగా ఆలోచించడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. ఈ క్రమంలో మన చుట్టూ ఉండే ఎన్నో విషయాల నుంచి స్ఫూర్తి పొందచ్చు. అందుకే నేను రూపొందించే పాదరక్షల విషయంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనుకుంటా. ఇందులో భాగంగానే.. స్నీకర్-జ్యుతీస్, లోఫర్-జ్యుతీస్, జ్యుతీస్-హీల్స్.. ఇలా విభిన్న రకాల కాంబినేషన్స్ ప్రయత్నిస్తుంటా. ఇక ఆకర్షణీయమైన రంగుల మేళవింపుతో, డిజైన్లతో వాటిని మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నా. ప్రస్తుతం ఇలాంటి వాటికి బాగా ఆదరణ ఉంటోంది. అలాగే వ్యక్తిగత అభిరుచులు, దుస్తులకు మ్యాచింగ్‌గా ఉండేలా కూడా కొంతమంది మా వద్ద పాదరక్షలు తయారుచేయించుకుంటారు..’ అంటోంది లక్షీత.
ప్రస్తుతం దేశంలోని కొందరు ప్రముఖ డిజైనర్లతో కలిసి పనిచేస్తోన్న ఆమె తన వ్యాపారంతో తానొక్కర్తే ప్రయోజనం పొందడం కాదు.. బెనారస్, కాంచీపురం, చందేరీ, లక్నో.. వంటి ప్రదేశాలకు చెందిన సంప్రదాయ కళాకారులకూ ఉపాధి కల్పిస్తోంది. ఇలా ఆమె రూపొందించే విభిన్న రకాల పాదరక్షలు దేశవ్యాప్తంగానే కాదు.. యూఎస్, యూఏఈ, నెదర్లాండ్స్.. వంటి దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.. ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్లలోనూ అందుబాటులో ఉన్నాయి. అంత ఆకట్టుకునేలా ఉన్నాయి కాబట్టే.. ఆలియా భట్, ఖుషీ కపూర్, కరీనా కపూర్, కియారా అడ్వాణీ, మానుషీ చిల్లర్.. వంటి తారలు వివిధ ప్రత్యేక సందర్భాల కోసం లక్షీత రూపొందించే పాదరక్షల్నే ఎంచుకుంటున్నారు.