ప్రస్తుత తరుణంలో స్కూల్ పిల్లలు రోజూ ఎన్ని కేజీల బరువు ఉన్న బ్యాగులను మోసుకుంటూ స్కూల్స్‌కు వెళ్తున్నారో అందరికీ తెలిసిందే. టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, టిఫిన్ బాక్సు, వాటర్ బాటిల్.. ఇలా వారు ఐటమ్స్‌ను నింపుకుని కేజీల కొద్దీ బరువున్న పుస్తకాలను మోస్తూ వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. పలువురు విద్యార్థులకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో గతంలోనే పిల్లల తల్లిదండ్రులు వారి బ్యాగుల బరువును తగ్గించాలని కోరారు కూడా. అయితే ఈ వినతిని దేశంలోని చాలా స్కూల్స్ పాటించడం లేదు. నేటికీ చాలా మంది విద్యార్థులు కేజీల కొద్దీ బరువున్న బ్యాగులను మోస్తూ స్కూల్స్‌కు వెళ్తున్నారు. అయితే తాజాగా కేరళలోని ఓ స్కూల్ మాత్రం పిల్లలకు ఈ బరువు నుంచి మోక్షం కల్పించింది. ఇంతకీ విషయం ఏమిటంటే…
కేరళలోని వయానద్ జిల్లాలో ఉన్న ది సర్వ్ ఇండియా ఆదివాసీ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో ఇకపై విద్యార్థులు కేజీల కొద్దీ బరువున్న బ్యాగులను మోయాల్సిన పనిలేదు. రోజూ ఎంచక్కా ఒక నోట్ పుస్తకాన్ని తీసుకువెళ్తే చాలు. ఎందుకంటే ఆ స్కూల్ విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం దాతల సహకారంతో ఎక్స్‌ట్రాగా నోట్, టెక్ట్స్ పుస్తకాలను, పెన్సిల్స్‌ను ఇచ్చింది. దీంతో వారు ఒక సెట్టును స్కూల్‌లో, మరొక సెట్టును ఇంట్లో పెట్టుకుంటారు. స్కూల్ కు వచ్చినప్పుడు అక్కడ ఉండే సెట్‌ను వాడుతారు. ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఉండే సెట్‌ను వాడుతారు. ఇక హోం వర్క్ ను నోట్ చేసుకునేందుకు మాత్రం రోజూ ఒక నోట్ పుస్తకాన్ని మాత్రం స్కూల్‌కు తీసుకువెళ్తారు. దీంతో పిల్లలకు భారీ బరువున్న బ్యాగులను తీసుకువెళ్లే అగత్యం తప్పింది. ఈ క్రమంలోనే స్కూల్‌లో ఉన్న ఒక సెట్టు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను దాచిపెట్టుకునేందుకు పిల్లలకు లాకర్ల సదుపాయం కూడా కల్పించారు.
అయితే ఢిల్లీలో కూడా స్కూల్ పిల్లల బ్యాగుల బరువును తగ్గించేందుకు అక్కడ ఓ సర్క్యులర్ జారీ చేశారు. అదేమిటంటే.. 1, 2 తరగతులకు చెందిన పిల్లల బ్యాగుల బరువు 1.5 కేజీలు మించరాదు. అలాగే 3 నుంచి 5 తరగతులు చదివే పిల్లల స్కూల్ బ్యాగులు 3 కేజీలకు మించరాదు. ఇక 6, 7 తరగతుల పిల్లల బ్యాగుల బరువు నాలుగున్నర కేజీలు, 8,9,10 తరగతులు చదివే పిల్లల బ్యాగుల బరువు 5 కేజీలు మించరాదు. అంతకు మించితే స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారు. ఏది ఏమైనా.. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా కేరళలోని ఆ స్కూల్ తరహాలో చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా..!