లాక్‌డౌన్ తెచ్చిన క‌ష్టం.. 2వేల కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కిన‌ ఒడిశా యువ‌కుడు..!

-

క‌రోనా లాక్‌డౌన్ దేశంలో ఎంతో మందికి క‌ష్టాల‌ను తెచ్చి పెట్టింది. క‌న్నీళ్ల‌ను మిగిల్చింది. కోట్ల మంది ఉపాధిని కోల్పోయారు. ల‌క్ష‌ల మంది వ‌ల‌స కార్మికులు వంద‌ల కిలోమీటర్లు కాలిన‌డ‌క‌నే త‌మ సొంత ఊళ్ల‌కు త‌ర‌లివెళ్లారు. క‌రోనా క‌ష్టాలు ఇంకా ఎన్నాళ్లు ఉంటాయో తెలియ‌క.. సొంత ఊర్లోనే ఏదో ఒక‌టి తిని బ‌త‌క‌వ‌చ్చ‌ని ఎంతో మంది వ‌ల‌స కూలీలు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు వ‌దిలి గ్రామాల బాట ప‌ట్టారు. ఒడిశాకు చెందిన ఆ యువ‌కుడు కూడా అలాగే న‌గ‌రం వ‌దిలి సొంత గ్రామానికి వెళ్లాడు. కానీ అందుకు అత‌ను ప‌డిన క‌ష్టం వ‌ర్ణ‌నాతీతం. అత‌ను ఏకంగా 2వేల కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు. ఎట్ట‌కేల‌కు సొంత రాష్ట్రానికి చేరుకున్నాడు.

this odisha young man cycled about 2000 kilo meters to go to his home town

ఒడిశాకు చెందిన 20 ఏళ్ల మ‌హేష్ జెనా మ‌హారాష్ట్ర‌లోని సంగ్లి-మిరాజ్ అనే ప్రాంతంలో ఓ ఫ్యాక్ట‌రీలో ప‌నిచేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆ ఫ్యాక్ట‌రీని మూసేశారు. మ‌రో 5 నెల‌ల వ‌ర‌కు ఫ్యాక్ట‌రీని ఓపెన్ చేయ‌రని తెలియ‌డంతో.. ఇక అక్క‌డ ఉండ‌డం వృథా అని భావించిన మ‌హేష్ త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బులోంచి రూ.1200 వెచ్చించి ఓ సైకిల్ కొన్నాడు. దానికి మ‌రో రూ.500 ఖ‌ర్చు పెట్టి టైర్‌, ట్యూబ్ వేయించాడు. ఆ త‌రువాత ఏప్రిల్ 1వ తేదీన ఉద‌యం 4.30 గంట‌ల‌కు సైకిల్‌పై బ‌య‌ల్దేరాడు. అత‌ను అలా నిత్యం 100కు పైగా కిలోమీట‌ర్ల వ‌ర‌కు సైకిల్ తొక్కేవాడు. రాత్రి పూట 12 గంట‌ల‌కు ప్ర‌యాణం ఆపి.. ఏదైనా గుడి లేదా ధాబా క‌నిపిస్తే.. అక్క‌డ పెట్టే ఉచిత భోజ‌నాన్ని తిని రాత్రి అక్క‌డే ప‌డుకుని తెల్లారి మ‌ళ్లీ త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించాడు.

అలా మ‌హేష్ మొద‌ట షోలాపూర్ చేరుకున్నాడు. అనంత‌రం హైద‌రాబాద్, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం, శ్రీ‌కాకుళం మీదుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఒడిశాలోని గంజాం చేరుకున్నాడు. అక్క‌డి నుంచి భువ‌నేశ్వ‌ర్, క‌ట‌క్ మీదుగా జాజ్‌పూర్ చేరుకున్నాడు. అయితే అత‌ని ప్ర‌యాణంలో పోలీసులు కూడా అత‌న్ని ఎక్క‌డా ఆప‌లేదు. త‌న ప‌రిస్థితిని అత‌ను పోలీసుల‌కు వివ‌రించాడు. దీంతో వారు అత‌న్ని వెళ్లేందుకు అనుమ‌తిచ్చారు. ఆ త‌రువాత ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం జాజ్‌పూర్ వ‌ద్ద ఒడిశా పోలీసులు చెక్ పోస్టు వ‌ద్ద అత‌న్ని ఆపి స‌మీపంలో ఉన్న ఓ క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. అక్క‌డ మ‌హేష్‌కు క‌రోనా టెస్టులు చేయ‌గా.. నెగెటివ్ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ అత‌ను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల‌ని అధికారులు చెప్పారు. దీంతో అత‌ను ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో కాలం గ‌డుపుతున్నాడు.

అయితే మ‌హేష్ ఈ విష‌యంపై మాట్లాడుతూ.. మ‌హారాష్ట్ర‌లో ఫ్యాక్ట‌రీ వ‌ద్ద ఇంకా అలాగే ఉంటే.. త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బు అంతా అయిపోతుంద‌ని భావించాన‌ని.. ఫ్యాక్ట‌రీని మ‌రో 5 నెల‌ల వ‌ర‌కు ఓపెన్ చేయ‌ర‌ని చెప్ప‌డంతో.. వెంట‌నే త‌న సొంత ఊరికి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని.. అందుకే 2వేల కిలోమీట‌ర్ల దూరం సైకిల్‌పై ప్ర‌యాణం చేసేందుకు ధైర్యం చేశాన‌ని చెప్పాడు. అయితే సాధార‌ణంగా అధునాత‌న సైకిల్స్ ఉన్న సైక్లిస్టుల‌కే లాంగ్ జ‌ర్నీలు చేయ‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. కానీ మ‌హేష్ మాత్రం చాలా త‌క్కువ ఫుడ్‌, నీరుతో ఓ డొక్కు సైకిల్ వేసుకుని 2వేల కిలోమీట‌ర్లు ప్రయాణించడంపై సైక్లిస్టులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అత‌నిలో సైక్లింగ్ ప్ర‌తిభ ఉంద‌ని వారు భావిస్తున్నారు. అవును మ‌రి.. దేశంలో ఇంకా ఇలాంటి వారు ఎంతో మంది ఉండే ఉంటారు. వారంద‌రినీ గుర్తించ‌క‌పోవ‌డం.. నిజంగా మ‌నకు, మ‌న దేశానికి అవ‌మాన‌క‌ర‌మే క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news