సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కదా.. అలాంటిది చెత్త ఏరుకునే తమపైనే ఎందుకంత చులకన భావం ? అని ఆలోచించిన మాయా.. తమ వర్గానికి చెందిన వారు పడుతున్న బాధలను చెప్పడానికి ఓ షార్ట్ ఫిలిం తీయాలనుకుంది.
సమాజంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడే శక్తి ఉంటే చాలు.. ఎవరైనా ప్రజలకు నాయకత్వం వహించవచ్చు. వారి తరఫున పోరాటం చేయవచ్చు. అంకిత భావం, కృషి, పట్టుదల ఉంటే.. ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఎవరైనా.. ఏదైనా చేయవచ్చు.. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మింది కాబట్టే.. ఆమె చెత్త ఏరుకునే స్థాయి నుంచి కెమెరా పట్టుకునే స్థాయికి వచ్చింది. ఆమే.. మహారాష్ట్రకు చెందిన మాయా ఖోడ్వే.
మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన మాయా ఖోడ్వే అక్కడి మురికివాడల్లో చెత్తను ఏరుకుంటుంది. ఆమెకే కాదు.. ఆమె చుట్టు పక్కల ఉండే ఎంతో మందికి అదే జీవనాధారం. అయితే చెత్త ఏరుకుని వారిని ఈ సమాజం ఎప్పుడూ చిన్న చూపు చూస్తుంది కదా. అలాగే మాయాను కూడా చాలా మంది చిన్నచూపు చూడడం మొదలు పెట్టారు. కొన్ని సందర్భాల్లో ఆమె చెత్త ఏరుకునేటప్పుడు ఆమె శారీరక, మానసిక వేధింపులకు కూడా గురయ్యేది. అయినా ఆమె తన పని తాను చేసుకుపోయేది.
అయితే సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కదా.. అలాంటిది చెత్త ఏరుకునే తమపైనే ఎందుకంత చులకన భావం ? అని ఆలోచించిన మాయా.. తమ వర్గానికి చెందిన వారు పడుతున్న బాధలను చెప్పడానికి ఓ షార్ట్ ఫిలిం తీయాలనుకుంది. కానీ అది ఆమెకు చేతకాదు. దీంతో వీడియో షూటింగ్, ఎడిటింగ్ నేర్చుకునేందుకు ఓ స్వచ్ఛంద సంస్థలో ఆమె చేరింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆ సంస్థ మూత పడడంతో మరో సంస్థలో చేరిన ఆమె ఎలాగో వీడియో షూటింగ్, ఎడిటింగ్ లలో శిక్షణ తీసుకుంది.
అలా మాయా కొద్ది రోజుల పాటు కష్టపడి షార్ట్ ఫిలిం ఎలా తీయాలో నేర్చుకుంది. అయితే వీడియో ఎడిటింగ్‌లో ఆమెకు మొదట్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంగ్లిష్ పదాలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనిపించింది. అయినా ఆమె కష్టపడి వీడియో ఎడిటింగ్ నేర్చుకుంది. ఈ క్రమంలో తొలిసారిగా తమ వాడలో రహదారిపై పారుతున్న డ్రైనేజీని ఆమె వీడియో తీసింది. కానీ ఆమె ఆ పని చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారు నవ్వారు. కానీ ఆమె వీడియో తీశాక అది చూసి ఆమెను మెచ్చుకున్నారు. ఆ తరువాత మాయా ఆ వీడియోను మున్సిపల్ అధికారులకు చూపించగా, వారు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. అది మాయా సాధించిన తొలి విజయం అని చెప్పవచ్చు.
ఆ తరువాత మాయా స్వచ్ఛంద సంస్థ సహకారంతో తమ వర్గానికి చెందిన వారు పడుతున్న బాధలను ప్రపంచానికి తెలియజేసేందుకు షార్ట్ ఫిలిం తీయడం ప్రారంభించింది. అయితే ఆమె ఖరీదైన కెమెరాతో షూటింగ్ చేస్తున్నప్పుడు పోలీసులు ఆమెను కొట్టారు. ఆమె కెమెరాను ఎక్కడో దొంగిలించిందని వారు అనుకున్నారు. కానీ ఆమె భయపడలేదు. షార్ట్ ఫిలింలను తీయడం కొనసాగించింది. దాంతోపాటు తనలాగే మరికొందరు మహిళలకు ఆమె వీడియో షూటింగ్, ఎడిటింగ్‌లలో శిక్షణనివ్వాలని లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం మాయా ఆ పనిలో కొనసాగుతోంది. ఆమె అనుకున్న ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం..!