టీకొట్టుతో నాలుగుకోట్ల టర్నోవర్‌.. ఎంబీఏ చాయ్‌వాలా సక్సస్‌ఫుల్‌ స్టోరీ.!

-

టీకొట్టు నడుపుకుంటే ఖర్చులకు పోనూ వేలల్లో మిగులుతుంది. లక్షలు సంపాదించడం అత్యాసే అంటారు.. చిల్లర కొట్టే కాసులు కురిపిస్తే..ఎంబీఏ పూర్తి చేసిన ఓ యువకుడు టీకొట్టు పెట్టి కోట్లు సంపాదిస్తున్నాడు. ఇతని గురించి యావత్‌ దేశం మాట్లాడుకుంటుంది. ఎంబీఏ చాయ్‌వాలగా తను ఫేమస్‌ అయిపోయాడు కూడా..! చాయ్‌ షాపుతో అంత మొత్తంలో ఎలా సంపాదిస్తున్నాడు..?
ప్రఫుల్‌ బిల్లోర్‌ చిన్నప్పుడే పెద్దయ్యాక బాగా సంపాదించి మంచి పేరు తెచ్చుకోవాలని గట్టిగా ఫిక్స్‌ అయ్యాడు. ఎంబీఏ పూర్తి చేసి కొడుక్కు మంచి ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులు అనుకున్నారు.. నాలుగుసార్లు ప్రయత్నించినా ‘క్యాట్‌’ దాటలేదు. ఇంక ఎంబీఏ పట్టా అందేదెలా? అయినా అతడిలో సంపాదించాలనే ఆశ చనిపోలేదు. వ్యాపారవేత్తల స్ఫూర్తిదాయక పుస్తకాలు బాగా చదివేవాడు. 2016లో అతడి దగ్గరున్న కొద్దిపాటి మొత్తం తీసుకొని సొంతూరు ‘ధర్‌’ దాటాడు.
రోజూ కొత్త వ్యక్తుల్ని కలిసి వాళ్ల ఆలోచనలు వినేవాడు. చివరికి ఓ వ్యాపార ప్రయత్నంలో ఉండగా ఇంట్లో వాళ్లు పోరు పడలేక.. అహ్మదాబాద్‌లో ఓ కాలేజీలో ఎంబీఏలో చేరాడు. మరోవైపు ‘మెక్‌డొనాల్డ్స్‌’లో పార్ట్‌టైం ఉద్యోగం. కొన్నాళ్లయ్యాక అతడికి అర్థమైన విషయం ఏంటంటే.. ఎంబీఏ పూర్తి చేసినా లక్షలకొద్దీ సంపాదించలేనని. ఉన్నఫళంగా చదువాపేసి అహ్మదాబాద్‌లోని ఓ రహదారి పక్కనే టీకొట్టు తెరిచాడు.
సీజన్‌తో పనిలేదు.. సమయంతో పట్టింపులేదు.. ఎనీ టైమ్‌ ఫుల్ డిమాండ్‌ ఉంటే వ్యాపారం ఇదొక్కటే.. అందుకే చాయ్‌ బాట పట్టా’ అంటున్నాడు ప్రఫుల్‌. పైగా పెట్టుబడి తక్కువ. దానికి తన దగ్గరున్న రూ.8 వేలు కేటాయించాడు. టీకొట్టుకి ‘మిస్టర్‌ బిలియనీర్‌ అహ్మదాబాద్‌’ (ఎంబీఏ) అనే పేరు పెట్టాడు. ‘అంతదూరం వెళ్లింది ఇది చేయడానికా?’ అని తల్లిదండ్రులు, బంధువులూ ఇష్టం వచ్చినట్లు తిట్టారు..లైట్‌ తీసుకున్నాడు.. పట్టించుకోలేదు.
మొదట్లో అతడి టీ ఏమంత రుచిగా ఉండేది కాదు. కొన్నాళ్లకి పట్టు సాధించాడు. ప్రఫుల్‌ చూడటానికి స్టైలిష్‌గా ఉంటాడు. ఆకట్టుకునే పేరు. మెల్లగా జనం పోగవసాగారు. ఈ ఉత్సాహంతో వ్యాపారం పెంచుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేసేవాడు. కేఫ్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం, లూడో గేమ్స్‌ ఆడించడం.. తమకిష్టమైన వారికి సందేశాలు రాసుకునేలా బోర్డులు ఏర్పాటు చేయడం.. ఇలాంటి కిటుకులు నేర్చాడు..బాగా పని చేశాయి. రెండేళ్లలో బాగా పేరు రావడంతో రెండో కేఫ్‌ని సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తెరిచాడు.
అలా సీన్‌ కట్‌ చేస్తే.. నాలుగేళ్లలో యాభై ఫ్రాంచైజీలకు విస్తరించాడు. ఒక్కో కేఫ్‌లో యాభై మంది కూర్చునేలా.. విశాలంగా ఏర్పాటు చేశాడు. జనానికి నచ్చే రుచి.. అభిరుచులకు తగ్గ వినోదం.. అంతే మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లు టీకొట్టు వెలిగిపోయింది.. టర్నోవరు నాలుగుకోట్ల రూపాయలు దాటింది. అలా తను బాగా డబ్బు సంపాదించాలన్న ఆశయాన్ని సాధించుకున్నాడు. మనలో ఐడియాస్‌ ఉంటే ఏదైనా చేసేయొచ్చు. శ్రమ, పట్టుదల, ఓపిక ఉండాలి.!

Read more RELATED
Recommended to you

Latest news