నటుడు అలీ తన మిత్రుడైన పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేనలో ఎందుకు చేరలేదో తానే వివరించారు. వైసీపీలో చేరిన సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ తనకు మంచి స్నేహితుడని అలీ తెలిపారు.
సినీ నటుడు, కమెడియన్ అలీ గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు అలీ అంటే ఎంతో అభిమానం. హీరోగానే కాదు, కమెడియన్‌గా అలీ చేసిన సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఈ క్రమంలోనే గొప్ప నటుడిగానే కాదు, కమెడియన్‌గా కూడా అలీ పేరుపొందాడు. అయితే ఇటీవలి కాలంలో అలీ రాజకీయ ప్రవేశంపై అనేక వార్తలు వచ్చాయి. ఆయన వైకాపాలో చేరుతారని ఒకసారి, లేదు టీడీపీ అని ఒకసారి, కాదు కాదు.. జనసేనలో చేరుతారని మరొకసారి పుకార్లు షికార్లు చేశాయి.
అయితే ఎట్టకేలకు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఆయన జగన్ సమక్షంలో వైకాపా కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. దీంతో కొద్ది రోజులుగా అలీ రాజకీయ ప్రవేశంపై వస్తున్న పుకార్లకు చెక్ పడినట్లయింది.
అయితే అలీ వైసీపీలో చేరడంపై కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలను పక్కన పెడితే అలీ.. నటుడు పవన్ కల్యాణ్‌కు మంచి మిత్రుడు. పవన్ సినిమాల్లో అలీ కచ్చితంగా ఉంటారు. అంతేకాదు తెర బయట కూడా పవన్ చేసే ప్రతి పనికి అలీ సపోర్ట్ ఇస్తుంటాడు. అయితే అలీ పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీలో కాకుండా వైకాపాలో ఎందుకు చేరారని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా ఇప్పుడు అలీ జనసేనలో చేరకపోవడాన్ని విమర్శిస్తున్నారు.
నటుడు అలీ తన మిత్రుడైన పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేనలో ఎందుకు చేరలేదో తానే వివరించారు. వైసీపీలో చేరిన సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ తనకు మంచి స్నేహితుడని అలీ తెలిపారు. ఆయన్ను ఎట్టి పరిస్థితిలోనూ వదలనని తెలిపారు. ఆయన సక్సెస్ సాధిస్తే తాను సాధించినట్లేనని అలీ తెలిపారు. తమ మధ్య ఉన్న స్నేహం గురించి ఎవరికీ తెలియదన్నారు. తనపై పవన్ అభిమానులు విమర్శలు చేయడం సరికాదని అలీ తెలిపారు. జనసేన పార్టీలో చేరేందుకే తొలుత పవన్‌ను కలిశానని, కానీ పవన్ అందుకు ఇష్టపడలేదని అలీ తెలిపారు. తనతో రాజకీయాలలో ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటావని పవన్ తనను హెచ్చరించారని.. కనుకనే జనసేనలో చేరలేదని అలీ తెలిపారు. ఈ క్రమంలో పవన్ నా ఇష్టం ఉన్న పార్టీలో నన్ను చేరమని చెప్పారని.. అందుకునే నా ఇష్టం మేరకే నేను వైకాపాలో చేరానని.. అలీ తెలిపారు..!