యాపిల్ బ్రాండ్ ఐటమ్స్ లో ఏవోవో ఫీచర్స్ ఉంటాయి. కానీ మనం ఇవన్నీ పనిచేస్తాయా పాడా.. ఏదో పైసల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని చెప్తున్నారు అని అనుకుంటాం.. కానీ.. నామమత్రంగా కాదు.. అందులో ఉండే ప్రతీ ఫీచర్ కచ్చితంగా పనిచేస్తుందని తాజాగా జరిగిన ఓ సంఘటన స్పష్టం చేసింది. చేతికి పెట్టుకునే యాపిల్ వాచ్ తో హార్ట్ ఎటాక్ ముప్పును ముందే గమనించి సకాలంలో ఆసుపత్రికి చేరేలా చేసింది. ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ వచ్చిదంటే.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు పోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ వాచ్ ఎలా కాపాడిందో మనమూ చూద్దాం..!
హర్యానాకు చెందిన అతని పేరు నితేష్ చోప్రా. వయస్సు 33 ఏళ్లు. అతనో డెంటిస్ట్. తన భార్యకు యాపిల్ వాచ్ కొనిచ్చాడు. నితేష్‌కు కొంతకాలంగా నీరసంగా ఉంటోంది. తన భార్య వాడుతున్న యాపిల్ వాచ్ 6 సిరీస్‌లో హెల్త్ స్టాట్స్ తెలుసుకోవచ్చని అతనికి తెలుసు. యాపిల్ వాచ్‌లో ఈసీజీ ఫీచర్ కూడా ఉంది. తన భార్య యాపిల్ వాచ్ నుంచి ఓసారి ఈసీజీ చెక్ చేశాడు. ఈసీజీలో కాస్త తేడా కనిపించింది. AfibAlert వచ్చింది. AfibAlert అంటే గుండె కొట్టుకునే తీరును పర్యవేక్షించే ఫీచర్.
రెండుమూడుసార్లు చెక్ చేసినా రీడింగ్ అలానే చూపించింది. ప్రతీసారి AfibAlert రావడంతో నితేష్ వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ వెంటనే ఈసీజీ చేశారు. ఈసీజీలో కాస్త తేడా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చి మరిన్ని పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో సీసీయూలో ఉన్నప్పుడు మానిటర్‌లో కనిపించిన రీడింగ్, యాపిల్ వాచ్‌లో వచ్చిన రీడింగ్ ఒకేలా ఉన్నాయని నితేష్ అన్నారు.
అదే రోజు నితేష్‌కు యాంజియోగ్రఫీ కూడా చేశారు. ప్రధాన హృదయ ధమని పూర్తిగా బ్లాక్ అయిందని ఆ పరీక్షల్లో తేలింది. ఆ తర్వాత వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు ఇమెయిల్ ద్వారా తెలిపారు.
నితేష్ భార్య నేహా. యాపిల్ ప్రొడక్ట్ తన భర్త ప్రాణాన్ని కాపాడిందని వివరించింది. యాపిల్ అందించిన టెక్నాలజీ కారణంగానే సరైన సమయంలో ఆస్పత్రికి వెళ్లగలిగామని, ఇప్పుడు తన భర్త ఆరోగ్యంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. తాను యాపిల్ వాచ్‌ను ఫ్యాషన్ యాక్సెసరీగా భావించానని, సమయం చూడటానికి, స్టెప్ కౌంట్ కోసం పనిచేస్తుందని అనుకున్నాననే కానీ యాపిల్ వాచ్ తన జీవితాన్ని కాపాడుతుందని ఊహించలేదన్నారు నితేష్.
యాపిల్ వాచ్ 7 సిరీస్ హైలెట్స్
గతేడాది అక్టోబర్‌లో యాపిల్ వాచ్ 7 సిరీస్ అమ్మకాలు మొదలైన సంగతి తెలిసిందే. యాపిల్ వాచ్ 7 సిరీస్ ప్రారంభ ధర రూ.41,900. జీపీఎస్+సెల్యులార్ వర్షన్ కూడా ఉంది. ఇందులో వాచ్ఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ వాచ్‌లో అతిపెద్ద డిస్‌ప్లే ఉంది. యాపిల్ వాచ్ 7 సిరీస్ వాచ్‌లల్లో ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో 18 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది.
కాస్త ఖరీదైన ఇలాంటి వాటికి డబ్బు పెట్టడంలో తప్పు లేదేమో కదా..! ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇలా హెల్త్ రీడింగ్ ఇచ్చేవి ఉండటంలో చాలా మేలు జరుగుతుంది.
-Triveni Buskarowthu