పల్లెల నుంచి పట్నాలకు పయనం అయి వచ్చాం, చదువుకోవడానికే, జాబ్ చేయడానికో పట్టణాల్లో ఉంటున్న వాళ్లు ఎంతో మంది. సొంత ఇళ్లు కంటే అద్దె ఇళ్లలో ఉండే వాళ్లు మన దేశంలో చాలా మంది ఉన్నారు. సొంతూరులో ఇళ్లు ఉంటుంది కానీ జాబ్ ఉండదుగా..! ఇలా అద్దెకు ఉంటున్నవాళ్లకు సాధారణంగా అప్పుడ్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఓనర్ ఎప్పుడు పడితే అప్పుడు రావడం, ఇళ్లు చూడటం, అద్దె టైమ్‌కి ఇవ్వకపోతే ఆగం ఆగం చేయడం, ఇంటికి కరెంట్, వాటర్ ఆపడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కానీ ఇదంతా చేసే హక్కు యజమానికి లేదు. ఒక టెనెంట్‌గా మీరు మీకు ఉన్న హక్కుల గురించి తెలుసుకోవాలి. అలాగే ఓనర్‌కు పరమితిలు ఏంటో కూడా తెలిసి ఉండాలి. అవేంటో తెలుసుకుందామా..!
ఒక స్థలం లేదా ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే రెండు పార్టీలు రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి కిరాయి, వసతుల కల్పన, ఇతర వివరాలు ఇందులో స్పష్టంగా ఉంటాయి. అయితే దేశంలో 90 శాతం మంది రెంటల్ అగ్రిమెంట్ లేకుండానే నివసిస్తుంటారు. ఏదేమైనా అద్దెకుండే వారికి కొన్ని న్యాయపరమైన రక్షణలు, హక్కులు ఉంటాయి.
యజమానులు, అద్దెకుండే వ్యక్తులు రెంటల్ అగ్రిమెంటుకు బద్ధులై ఉండాలి. కిరాయి చెల్లింపు, సరైన సమయంలో ఇవ్వడం, కాల పరిమితి, ఆస్తి నిర్వహణ వంటివి చూసుకోవాలి. ఇస్తున్న డబ్బుకు బదులుగా స్థలం లేదా ఇంటిని అద్దెకుండే వ్యక్తి పూర్తిగా వాడుకోవచ్చు. ఒకవేళ లేటుగా కిరాయి ఇస్తే యజమాని న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు.
అద్దెకు తీసుకున్న వ్యక్తులు ఇంటిని లేదా స్థలాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవసరమైతే చిన్న చిన్న మరమ్మతులు చేయించుకోవాలి. భారీ మరమ్మతుల బాధ్యత యజమానిదే.
యజమానికి ఇంటిని సందర్శించే హక్కు ఉన్నప్పటికీ ముందుగా అద్దెకుంటున్న వ్యక్తులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వారి గోప్యతకు భంగం కలిగించకూడదు.
అద్దెకుంటున్న చోటులో నీటి సరఫరా, విద్యుత్, పారిశుద్ధ్య సేవలు కల్పించాల్సిన బాధ్యత యజమానిదే. ఒకవేళ అద్దె ఆలస్యంగా ఇచ్చినా వీటిని అడ్డుకొనే అధికారం వారికి ఉండదు.
కిరాయికి ఉంటున్న వ్యక్తులకు సముచిత రీతిలో అద్దె ఇచ్చే హక్కు ఉంటుంది. మాట్లాడుకున్న దానికన్నా ఎక్కువ డిమాండ్ చేసే అధికారం యజమానికి ఉండదు. మార్కెట్ లేదా ప్రాపర్టీ విలువను బట్టి అద్దె తీసుకోవాలి. ఒకవేళ అద్దె పెంచుకోవాలంటే యజమాని, అద్దె వ్యక్తి ఇద్దరూ అంగీకరించాల్సిందే.
ఇంట్లో పెళ్లి జరుగుతుందనో లేదా ఇతర అవసరాలు ఉన్నాయనో అద్దెకుంటున్న వారిని యజమానులు అనైతికంగా ఖాళీ చేయించకూడదు. వరుసగా రెండు నెలలు కిరాయి ఇవ్వకపోతే, ప్రవర్తన బాగాలేకుంటే, అనైతిక, వాణిజ్య అవసరాలకు ఇంటిని వాడుకుంటే, నష్టం కలిగిస్తే తప్ప వెళ్లిపోమనే హక్కు యజమానికి లేదు. ఇళ్లు ఖాళీ చేయాలంటే టెనెంట్ రెండు నెలల ముందు యజమానికి చెప్పాలి. అలాగే యజమానే వాళ్లను ఖాళీ చేయించాలంటే ఆరు నెలల ముందు టెన్‌ట్‌కు చెప్పాలి. ఉన్నట్టుండి దొబ్బేయ్‌మనే హక్కు యజమానికి లేదు. యజమాని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట ప్రకారమే నడుచుకోవాలి.
రెంటల్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్‌ను డిమాండ్ చేసే హక్కు అద్దెకు ఉంటున్న వారికి ఉంటుంది. యాజమాన్యం, అద్దె డబ్బు, చెల్లింపుల ప్రక్రియ వంటివి అందులో స్పష్టంగా పేర్కొనాలి. అలాగే ఇల్లు ఖాళీ చేస్తే పరిమిత సమయంలోనే యజమాని సెక్యూరిటీ డిపాజిట్ డబ్బును వెనక్కి ఇవ్వాలి.