నిద్రలో మనం చాలా చేస్తుంటాం..కానీ అది ఎవరికీ పెద్దగా గుర్తుండదు.. కలవరిస్తారు, గురకపెడతారు, అరుస్తారు, నవ్వుతారు, భయపడతారు ఇవన్నీ మనం నిద్రలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ చేసే చిలిపిచేష్టలు అనుకోవచ్చు.. గురకపెట్టడం మాత్రం అనారోగ్య సమస్యే.. అయితే కొంతమంది నిద్రలో పళ్లు కొరుకుతారు.. ఆ విషయం వాళ్లకు తెలియదు.. పక్కన వాళ్లు చూస్తారు. దీన్ని వైద్య పరిభాషలో బ్రక్సిజం (bruxism) అంటారు. బ్రక్సిజం కచ్చితంగా ఎందుకు వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ నిపుణులు మాత్రం కొన్ని కారణాలను చెబుతున్నారు.
ఆందోళన, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్తత ఎక్కువగా వారు నిద్రలో పళ్లు కొరుకుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా ఎందుకు చేస్తారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారే ఇలా చేస్తారని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలో పళ్లను కొరికితే వారికి ఆ విషయం తెలియదు. కానీ పక్కన ఉండే వారికి ఇబ్బంది కలుగుతుంది. వారికి నిద్ర పట్టదు. అయితే పిల్లల్లో మాత్రం పళ్లను కొరకడం అనేది వేరే కారణాల వల్ల వస్తుంది. చిన్నారుల్లో పేగుల్లో పురుగులు ఉన్నా, కాల్షియం, మెగ్నిషియం లోపాలు ఉన్నా.. వారు నిద్రలో పళ్లను కొరుకుతారు. కాబట్టి చిన్నారులకు పోషకాహారం ఇస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
పెద్దలు ఈ సమస్య తగ్గేందుకు ప్రత్యేకంగా ఎలాంటి మందులు ఉండవు.. కానీ ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.. ఇక మెగ్నిషియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
రాత్రి పూట పాలలో పసుపు కలుపుకుని తాగినా లేదా హెర్బల్ టీలను తాగుతున్నా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు రోజూ యోగా, ధ్యానం వంటివి చేసినా నిద్రలో పళ్లు కొరకడం అనే సమస్య తగ్గుతుంది.
నిద్రలో పళ్లు కొరకడం వల్ల మీకు దంతాల సమస్యలు కూడా రావొచ్చు.. కాబట్టి సమస్య మరీ ఎక్కువగా ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించండి.. అలాగే.. రాత్రి నిద్రపోయే ముందు కాఫీ లాంటి కెఫిన్ ఎక్కువగా ఉండే పానియాలు తీసుకోవద్దు. వీటివల్ల సరిగ్గా నిద్రపట్టదు.