పది రోజులకు రూ. 54 లక్షల బిల్లు వేసిన ఆసుపత్రి యాజమాన్యం..

-

ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదు అంటారు.. ఒక్కసారి ఏదైనా సమస్య వచ్చి ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యామంటే.. వేలు నీళ్లులా ఖర్చు అయిపోతాయి.. వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడానికి వందసార్లు ఆలోచించే వాళ్లం.. ఆసుపత్రికి వెళ్తే.. క్షణాల్లోనే అయిపోతాయి.. కార్పొరేట్‌ ఆసుపత్రుల సంగతి చెప్పనక్కర్లేదు.. నిలువు దోపిడి చేసేస్తారు.. తాజాగా హైదరాబాద్‌ మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ నేత అంజద్ ఉల్లా ఖాన్ ట్విటర్ ద్వారా షేర్ చేసిన పోస్ట్‌తో మరో ఆసుపత్రి బాగోతం బయటపడింది.. పది రోజులకు ఏకంగా రూ. 54 లక్షల బిల్లు వేశారట..అంత గొప్ప వైద్యం ఏం చేశారు..? .
ఎంబిటి నేత అంజద్ ఉల్లా ఖాన్ ట్విటర్ ద్వారా పేర్కొన్న వివరాల ప్రకారం.. సయ్యద్ రహ్మత్ ఉద్దిన్ అనే పేషెంట్ శేరిలింగంపల్లి సమీపంలోని నల్లగండ్లలో ఉన్న సిటిజెన్స్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో చేరాడు.. అతడికి 10 రోజుల పాటు చికిత్స చేసిన హాస్పిటల్.. మొత్తం రూ. 54 లక్షల బిల్లు చెల్లించాల్సిందిగా బిల్లు చేతిలో పెట్టింది.. ఇప్పటికే ఆస్పత్రికి రూ. 20 లక్షల వరకు చెల్లించిన పేషెంట్ కుటుంబసభ్యులు ఇక చెల్లించే పరిస్థితుల్లో లేమని చెప్పారు….కనీసం మరో రూ. 29 లక్షల బిల్లు చెల్లించనిదే పేషెంట్‌ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి వీల్లేదని హాస్పిటల్ వర్గాలు స్పష్టం చేశాయని అంజద్ ఉల్లా ఖాన్ ట్విటర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సైబరాబాద్ పోలీసులు, చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడికి చెక్ పెట్టే వ్యవస్థ ఏదైనా ఉంటే.. ఈ ఉదంతాన్ని పరిశీలించి ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంబీటీ నేత అంజద్ ఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. మొత్తం బిల్లు చెల్లించనిదే పేషెంట్‌ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి వీల్లేదని అడ్డుకుంటున్న ఆస్పత్రిపై చర్యలు తీసుకుని బాధితుడిని అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రి లేదా నిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అంజాద్ విజ్ఞప్తి చేశారు.
ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్పిటల్ వ్యవహారంపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. ట్విటర్ ద్వారా నేరుగా తెలంగాణ ప్రభుత్వ అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడం, ఈ ట్వీట్ వైరల్ అవుతుండటంతో ప్రభుత్వం ఈ ఘటనపైనే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రుల వైఖరిపై ఎలా స్పందిస్తుందా అనే ఆసక్తి ఉంది. కరోనా వైరస్‌ అప్పటినుంచి.. కార్పొరేట్‌ ఆసుపత్రులు అందినకాడికి దోచుకుంటున్నాయి..ఎన్నోచోట్ల ప్రాణాలు పోయినా.. బిల్లు కట్టకుంటే.. పేషంట్‌ను అప్పగించలేదు.. ఇలాంటి ఆసుపత్రులకు కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకా పేట్రేగిపోతాయి..

Read more RELATED
Recommended to you

Latest news