పుట్టినప్పుడు బతుకుతుందో లేదో అన్నారు.. 119 ఏళ్లు జీవించింది.. జీవనశైలి ఇలా ఉంటే సింపులే..!

-

ఈ రోజుల్లో మనిషి జీవితకాలం 70-80 ఏళ్లు వరకే ఉంటుంది. అసలు ఇక్కడి వరకూ వచ్చేవాళ్లు చాలా తక్కువ. 30 ఏళ్లకే దీర్ఘకాలిక రోగాలు వచ్చేస్తున్నాయి. ఇక వాటితో.. ఎలాగోలా ఇంకో ఇరవై ఏళ్లు గడపడడమే కనాకష్టమైంది. అలాంటి నేడు 119 ఏళ్లు జీవించిన ఓ బామ్మ అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తుంది. 2019లోనే ప్రపంచ అత్యంత వృద్ధ మహిళగా గిన్నిస్‌బుక్‌ రికార్డు సృష్టించింది ఆమె.. 119వ ఏట.. వయోభారంతో తుది శ్వాస విడిచారు. మరి ఆమె ఇన్ని సంవత్సరాలు ఎలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి జీనవశైలి అవలంబించారు..? ఇలాంటి విషయాలు నేటి తరం వారు కచ్చితంగా తెలుసుకోవాలి..!

కేన్‌ తనాకా 1903లో జన్మించారు. తొమ్మిదిమంది తోబుట్టువుల్లో ఆమెది ఏడో స్థానం. నెలలు నిండక ముందే జన్మించిన ఆమె.. (ప్రి-మెచ్యూర్‌ బేబీ) బతుకుతుందో లేదో అని వైద్యులు కూడా కంగారుపడ్డారట. కానీ 119 ఏళ్లు జీవించి.. ‘ప్రపంచంలోనే వృద్ధ మహిళ’గా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించారామె.

కేన్‌కు తన 19వ ఏట పెళ్లైంది. భర్త, కొడుకు రెండో చైనా-జపాన్ యుద్ధానికి వెళ్లగా, ఈమె నూడుల్స్‌ విక్రయించి కుటుంబాన్ని పోషణ చూసుకునేది. మరోవైపు కిరాణా కొట్టు కూడా నడిపేది.. 103 ఏళ్లు వచ్చే వరకు ఆ షాపు బాధ్యతలు తనే స్వయంగా చూసుకుందట..చిన్నప్పటి నుంచి ఉదయం 6 గంటలకు నిద్రలేచి తన పనులు పూర్తి చేసుకోవడం ఈ బామ్మకు అలవాటుగా ఉండేదట.. చనిపోవడానికి ముందు వరకూ ఇదే దినచర్యను కొనసాగించిదంటే నమ్మగలరా…

పాఠశాల స్థాయి నుంచే గణితంపై ప్రేమ పెంచుకున్న కేన్‌.. ఏమాత్రం ఖాళీ దొరికినా గణితాంశాలను నేర్చుకునేది.. చిన్న చిన్న లెక్కల్ని మనసులోనే చేసేస్తుంది. మానసికంగా ఆమెకున్న ఈ చురుకుదనమే ఈ బామ్మ మెదడును నిత్యం ఉత్సాహంగా ఉండేలా చేసింది. ఇంకా ఖాళీ టైంలో పజిల్స్ పూర్తి చేయడం కూడా ఈ బామ్మకు అలవాటే. కంటి నిండా నిద్రపోవడంతో పాటు ఏ సమస్యనైనా సానుకూలంగా ఆలోచించి, పరిష్కరించడంలో ఈ బామ్మ దిట్ట అని చెప్పవచ్చు. ఇదే ఆమెను అనునిత్యం పాజిటివిటీతో ఉండేలా చేసిందని చెబుతుంటారు ఆమె కుటుంబ సభ్యులు.

ఆహారం ఎలా ఉంటుందంటే..

చాక్లెట్‌, పండ్లరసాన్ని తీసుకోందే ఈ బామ్మకు రోజు గడిచేది కాదు. అంత ఇష్టమట. పులియబెట్టిన ఆహార పదార్థాలు, వేర్లు, ఆకుకూరలు, చేపలు.. వంటి పౌష్టికాహారం ఎక్కువగా తీసుకునేవారట. ఇవే తనను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఉంచుతున్నాయని పలు సందర్భాల్లో తెలిపారు.

సాధారణంగా మనకు బాగా నచ్చిన ఆహారమైతే ఓ ముద్ద ఎక్కువగా తినటం మనకు అలవాటు.. కానీ ఈ బామ్మ గారు ఇందుకు పూర్తి విరుద్ధం. ఈ క్రమంలో ఎంత ఇష్టమైన ఫుడ్‌ అయినా సరే 80 శాతం కడుపు నిండగానే ఆపేస్తారట. గ్రేట్ కదా.. మనసునెప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడమే తన సంతోషానికి కారణమని చెప్తుంటారు.

తన జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన ఆమె.. స్పానిష్‌ ఫ్లూ, కొవిడ్‌-19.. వంటి మహమ్మారుల్నీ అలవోకగా జయించారు. అంతేనా.. తన 35వ ఏట పారాటైఫాయిడ్‌ జ్వరం, 45వ ఏట పాంక్రియాటిక్‌ క్యాన్సర్, 103వ ఏట కొలొరెక్టల్ క్యాన్సర్‌.. వంటి జబ్బుల్నీ సైతం జయించారు. వయోభారంతో ఉన్నా వీటన్నింటినీ జయించగలిగారంటే ఇందుకు ఆమె పాటించిన ఆరోగ్యకరమైన జీవనశైలే కారణం.

ఇప్పుడు తన 119వ ఏట కన్నుమూసిన ఈ బామ్మ.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తుల్లో రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానం ఫ్రాన్స్‌కు చెందిన జియాన్నే లూయీస్‌ కాల్మెట్‌ అనే బామ్మ పేరున ఉంది. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించారు.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. మెదడు ప్రశాంతంగా ఉండాలి. కొందరికి అన్నీ ఉన్నా.. ఏదో వెలితి ఎప్పుడూ పట్టి పీడిస్తు ఉంటుంది. అది ఏదైనా కావొచ్చు. ఆ గాయలను మీ మనసు నుంచి బలవంతంగా చెరిపేసి ఉండొచ్చు.. కానీ మెదడు పొరల్లో అవి ఎప్పటికే పదిలంగానే ఉంటాయి. దానివల్లే కొన్నిసార్లు.. డిస్టబ్ అ‌వడం, దిగాలుగా ఉండటం జరుగుతుంది. ఈ బామ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఈమె పాటించిన జీవనశైలి అయితే పెద్ద కష్టమైనది కాదు కదా.. అవి మనం పాటిస్తే.. హ్యాపీగా వందేళ్లు బతికేయొచ్చు. ఎప్పడూ కూడా మనసును, మెదడును ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన వాటి గురించి, అవసరం లేని మనుషుల గురించి ఎక్కువ ఆలోచించి బుర్ర పాడుచేసుకోకూడదని మానసిక నిపుణులు చెప్తుంటారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news