ఏనుగుల పేరు మీద రూ. 5 కోట్ల ఆస్తి రాశాడు..కానీ

-

మనుషుల్లో స్వార్థం విపరీతంగా పెరిగిపోతున్న ఈరోజుల్లో కూడా.. మానవత్వం అక్కడక్కడా మనకు కనిపిస్తుంది. తోటి మనిషికే కాదు… మూగ జీవాలకు కూడా సాయం చేసే వ్యక్తులు ఇంకా ఉన్నారు. కోతులకోసం.. 32 ఎకరాలు రాసిచ్చాడో పెద్దాయన.. అప్పుడు అదో పెద్ద వార్త అనుకున్నాం.. ఇప్పుడు ఏనుగుల కోసం.. ఏకంగా 5 కోట్లు విలువైన ఆస్తి రాశాడు ఇంకో అతను.. అతని పేరే.. మహమ్మద్‌ అక్తర్‌ ఇమాన్‌.. ఇతని కథలో అన్నీ ట్విస్ట్‌లే.

బిహార్‌(Bihar)లోని జానిపూర్‌కు చెందిన మహమ్మద్‌ అక్తర్‌ ఇమామ్‌ వన్యప్రాణి సంరక్షకుడు. చిన్నప్పటి నుంచి ఆయన రెండు ఏనుగులను పెంచుకున్నాడు. వాటికి మోతి, రాణి అని పేర్లు పెట్టాడు. కుటుంబం కంటే ఎక్కువగా ఏనుగులను ప్రేమించిన అక్తర్‌ వాటి సంరక్షణ కోసం ‘ఏసియన్‌ ఎలిఫెంట్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ వైల్డ్‌ అనిమల్‌ ట్రస్ట్‌’(ఏఈఆర్‌ఏడబ్లూఏటీ)ను స్థాపించాడు. ఒక వేళ తాను చనిపోయినా వాటి మనుగడకు ఎలాంటి లోటు ఉండకూడదని భావించి తనకున్న రూ.5 కోట్ల విలువైన ఆస్తిని ఏనుగుల పేరు మీద వీలునామా రాశాడు.

ఇందుకు ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఒకసారి మోతిని ఓ మావటి తీసుకొని భోజ్‌పుర్‌ జిల్లాకు వెళ్లాడు. అక్కడ దానికి జబ్బు చేసింది. దాంతో అక్తర్‌ అక్కడికి పయనమయ్యాడు. వెళ్లి ఏనుగుకు చికిత్స చేయించాడు. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటుండగా అక్తర్‌ను చంపడానికి కొందరు దుండగులు యత్నించారు. ఆ సమయంలో మోతి ఘీంకరిస్తూ తనను మేల్కొల్పింది. అక్తర్‌ నిద్రలేచే సరికే కిటికీ గదిలో నుంచి ఓ వ్యక్తి తుపాకీ ఎక్కుపెట్టాడు. అదృష్టవశాత్తూ ఎలాగోలా తప్పించుకోగలిగాడు. ఆరోజు.. ఏనుగు అలా చేయకపోతే తాను బతికే వాడిని కాదని అక్తర్‌కు అర్థమైంది.

అసలు స్టోరీ ఇదే..

ఈ హత్యాయత్నం ఘటన వెనుక తన కుటుంబ సభ్యులే ఉన్నారని అక్తర్‌ ఆరోపించారు. తనను చంపి జంతువుల అక్రమ రవాణా ముఠాకు ఏనుగులను అప్పగించాలనే దురాలోచనతో ఈ పని చేశారని అక్తర్‌ అన్నారు… 2020లో కొవిడ్‌ నిబంధనలు సడలించిన తరువాత అక్తర్‌ రెండు ఏనుగులను రామ్‌నగర్‌ తీసుకొచ్చారు. అప్పటికే తనను ఎవరైనా హతమారుస్తారని అక్తర్‌కు అనుమానం ఉంది. ఎందుకంటే భార్య, కుమారులతో అక్తర్‌ విడిపోయారు. ఏనుగుల పేరిట ఆస్తి రాయడం వారికి ఎంత మాత్రం నచ్చలేదు. దాంతో అక్తర్‌ అనుకున్నదే నిజమైంది.. 2021లో ఆయనను దారుణంగా హత్య చేశారు. అయితే అప్పటికే వీలునామా రాయడంతో ఆస్తి మొత్తం ఏనుగులకు దక్కింది. అక్తర్‌ తన జీవితకాలం మొత్తం ఏనుగు సంరక్షణ కోసం కృషి చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఏనుగుల సంరక్షణ దిశగా చర్యలు తీసుకోకపోతే వాటిని పుస్తకాల్లో బొమ్మలుగా మాత్రమే చూడాల్సి వస్తుందని అక్తర్‌ ఎప్పుడూ బాధపడేవాళ్లు..

అక్తర్‌ మరణం తరువాత ఏనుగుల సంరక్షణ బాధ్యతలను స్థానిక అటవీ అధికారులు ఇమ్రాన్‌ఖాన్‌ అనే వ్యక్తికి అప్పగించారు. అక్తర్‌ ఆశయం కోసం ఇమ్రాన్‌ ఇప్పుడు పని చేస్తున్నారు. 35 ఏళ్ల ఏనుగు మోతి గత నెలలో అనారోగ్యంతో చనిపోయింది. ప్రస్తుతం రాణికి 25 ఏళ్లు. అక్తర్‌కు ఆస్తికి ఏకైక వారసురాలిగా కొనసాగుతోంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. ప్రస్తుతం రాణి ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఉంటోంది. ఆస్తి పట్నాలో ఉంది. అక్తర్‌ స్థాపించిన ఫౌండేషన్‌ నడుస్తున్నప్పటికీ దానికి సరిపడా నిధులు అందడం లేదు. పట్నాలోని రాణి పేరిట ఉన్న ఆస్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రమే అక్తర్‌ ఆశయం నెరవేరుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు.

ఏనుగుల కోసం తన జీవితం అంతా కృషి చేసిన అక్తర్‌ నేటి తరానికి చాలా అవసరం.. అక్తర్‌ లాంటి మనుషులను మనం పుస్తకాల్లో తప్ప ఇంక నిజజీవితంలో చూడలేవేమో..!

Read more RELATED
Recommended to you

Latest news