ఆ బావిలోని నీటిని తాగితే డ‌యాబెటిస్ ఠ‌క్కున త‌గ్గుతుంద‌ట‌.. నీటి కోసం క్యూ క‌డుతున్న జ‌నాలు..!

-

ఆ బోరుబావిలో ఉన్న నీటిని తాగితే డయాబెటిస్ మాత్రమే కాదు, ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయ‌ని జోరుగా ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఆ బావి వ‌ద్ద‌కు వ‌చ్చే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.

ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల ప్ర‌జ‌ల‌తో పోలిస్తే మ‌న భార‌తీయుల‌కు స‌హ‌జంగానే కాస్తంత వెర్రి ఉంటుంది. అవును నిజ‌మే. ఎందుకంటే.. ఎవ‌రైనా ఏదైనా న‌మ్మ‌లేని.. సాధ్యం కాని విష‌యం చెబితే.. అది నిజ‌మేన‌ని న‌మ్ముతారు. గ‌తంలో మ‌నం అనేక సంఘ‌ట‌న‌ల్లో ఈ విష‌యాన్ని ప్ర‌త్యక్షంగా చూశాం కూడా. వినాయ‌కుడు పాలు తాగుతున్నాడ‌ని, చెట్టు నుంచి ర‌క్తం వ‌స్తుంద‌ని, ఫ‌లానా విధంగా చేస్తే.. లంకెల బిందెలు దొరుకుతాయ‌ని.. ఇలా అనేక ర‌కాల పుకార్లు, మూఢ న‌మ్మ‌కాలు మ‌న దేశంలో ఒక‌ప్పుడు బాగా ప్ర‌చారం అయ్యాయి. ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో ఇలాంటి పుకార్లు రోజుకొక‌టి పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ జ‌నాలు మాత్రం వీటిని న‌మ్మ‌డం మాన‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రొక పుకారు కూడా బాగా ప్ర‌చార‌మ‌వుతోంది. అదేమిటంటే…

హ‌ర్యానా రాష్ట్రంలోని రెవాడి జిల్లా గుజ‌రీవాస్ గ్రామంలో నివాసం ఉండే మాండురామ్ త‌న పొలాన్ని స్థానికంగా ఉండే అలీ మ‌హ‌మ్మ‌ద్ అనే వ్య‌క్తికి కౌలుకిచ్చాడు. అయితే ఆ పొలంలో బోరు బావి ఉంది. ఈ క్ర‌మంలో అలీ భార్య కొన్ని రోజుల పాటు ఆ బోరుబావి నీటిని తాగింద‌ట‌. దీంతో ఆమెకున్న డ‌యాబెటిస్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌ట‌. ఈ క్ర‌మంలో అదే విష‌యాన్ని ఆమె ఇరుగు పొరుగు వారికి చెప్ప‌గా.. అది ఆ చుట్టు ప‌క్క‌లంతా వ్యాపించింది. దీంతోపాటు సోష‌ల్ మీడియాలోనూ ఈ విష‌యంపై బాగా ప్ర‌చారం అయింది. అంతే.. ఇక ఆ బోరుబావిలో ఉన్న నీటిని తాగేందుకు చాలా మంది ఇప్పుడు ఆ గ్రామానికి క్యూ క‌డుతున్నారు. ఆ బోరుబావిలో ఉన్న నీటిని తాగితే డయాబెటిస్ మాత్రమే కాదు, ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయ‌ని జోరుగా ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఆ బావి వ‌ద్ద‌కు వ‌చ్చే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.

ఈ క్ర‌మంలో స‌ద‌రు బావిలోని నీటిని లీట‌ర్‌కు రూ.50 కు అమ్ముతున్నార‌ట‌. అలాగే ఆ బావి ఉన్న పొలం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవారికి చుట్టు ప‌క్క‌ల పొలాల వారు కొంత రుసుం వ‌సూలు చేసి వాహ‌నాల పార్కింగ్‌, ఇతర స‌దుపాయాల‌ను కూడా అందిస్తున్నార‌ట‌. అయితే ఈ విష‌యం సైంటిస్టుల‌కు తెలియ‌డంతో వారు ఆ బోరు బావి నీటిని ప‌రీక్షించి చూశారు. కాగా అందులో ఔష‌ధ గుణాలు మాత్రం లేవ‌ని, కానీ.. అందులో బాక్టీరియా పుష్క‌లంగా ఉంద‌ని, క‌నుక ఆ నీటిని తాగితే అనారోగ్య స‌మ‌స్య‌లు మాయ‌మ‌వ‌డం మాట దేవుడెరుగు, కొత్త అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని కూడా వారు చెబుతున్నారు. అవును మ‌రి.. జ‌నాల‌కు ఇలాంటి విష‌యాలు ఏవి తెలిసినా.. వారు గుడ్డిగా న‌మ్మేస్తారు. ఆ త‌రువాత నిజం తెలిసి న‌ష్ట‌పోయామ‌ని గ్ర‌హిస్తారు. మ‌న దేశంలో ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న‌దే ఇది క‌దా.. ఏం చేస్తాం.. జ‌నాలు మార‌నంత కాలం ఇలాంటి పుకార్లు వ్యాప్తి చెందుతూనే ఉంటాయి.. క‌లికాలం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version