కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినా వీరి రాత మారలేదా?

-

ఒకప్పుడు రాజకీయంగా చక్రం తిప్పారు. కాలం కలిసిరాలేదో ఏమో.. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడ్డారు. అధికార పార్టీలో చేరినా జాతకం మారలేదట. పదవుల కోసం వేట సాగిస్తున్నా నిరాశ తప్పడం లేదట..తెలంగాణ రాజకీయాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్ర బిందువుగా చెబుతుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ హవా నడిచింది. ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పాకులాడుతోంది. వరుసగా రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో జిల్లాలోని కాంగ్రెస్‌ నేతల్లో ఎక్కువ మంది కారెక్కేశారు. ఇప్పుడీ నేతలంతా తమ పొలిటికల్ ఫ్యూచర్ పై పెద్ద కనఫ్యూజన్ లో ఉన్నారు.

కరీంనగర్ జిల్లా మానుకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌ కూడా ఉన్నారు. వీళ్లంతా అధినేత సమక్షంలోనే గులాబీ కండువా కప్పుకొన్నారు. ఇక అన్నీ మంచిరోజులే అని ఆశించారు. కానీ.. కాలం మారినా.. పార్టీ ఫిరాయించినా ఎలాంటి గుర్తింపు లేదట. ఇదే ఆ ముగ్గురు గురించి వినిపిస్తున్న టాక్‌. పార్టీ పదవుల్లోకానీ.. నామినేటెడ్‌ పోస్టుల్లోకానీ వీరి గురించి అస్సలు పట్టించుకోవడం లేదట. పైగా ఆయ నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు తలనొప్పులు ఎక్కువ అవుతున్నట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

గెలిచిన ఎమ్మెల్యేలతో సయోధ్య లేదు. దీంతో ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వీళ్లను పిలవడం లేదట. మానుకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌కు మొదటి నుంచీ పడదు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా అదే గ్యాప్‌ కొనసాగుతోందట. ఆరేపల్లిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం రసమయికి ఇష్టం లేదని అంటారు. దీనికితోడు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు పిలిస్తే ఎమ్మెల్యే ఎక్కడ నొచ్చుకుంటారో అని మిగతా వారు కూడా ఆరేపల్లి జోలికి వెళ్లడం లేదట. గతంలో ప్రభుత్వ విప్‌గా, ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా చక్రం తిప్పిన ఆరేపల్లికి, ఆయన వర్గానికి ఈ పరిణామాలు రుచించడం లేదని సమాచారం. జరుగుతున్న ఘటనలపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడ లేదట. దీంతో ఆయన బీజేపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారట.

హుస్నాబాద్‌లో మాజీ ప్రవీణ్‌రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో టికెట్‌ దొరకలేదు. మహాకూటమి పొత్తులో భాగంగా CPIకి ఇచ్చారు. ముల్కనూరు సహకార బ్యాంకు అధిపతిగా కూడా ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు. మొన్నటి వరకూ నియోజకవర్గంలో కలియ తిరిగిన ఆయన.. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తగిన గుర్తింపు లేక సైలెంట్‌ అయ్యారట. ఇక్కడ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు కుటుంబానికి ప్రవీణ్‌రెడ్డి కుటుంబానికి రాజకీయ వైరం ఉంది. దాంతో ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ కలుపుకొని వెళ్లడం లేదని అంటున్నారు. కాలం కలిసొచ్చే వరకూ కామ్‌గా ఉందని అనుచరులకు నచ్చజెబుతున్నట్లు సమాచారం.

మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌ సైతం జిల్లాలో పెద్దగా ఎవరికీ కనిపించడం లేదట. టీఆర్‌ఎస్‌లో చేరినా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని సమాచారం. ఇచ్చిన హామీలను పార్టీ పెద్దలు పెడచెవిన పెట్టారని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేది.. పార్టీ మారి తప్పు చేశామా అని కూడా కొన్ని సందర్భాలలో వ్యాఖ్యానిస్తున్నారట. మొత్తానికి ఆరేపల్లి మోహన్‌, ప్రవీణ్‌రెడ్డి, సంతోష్‌ కుమార్‌ తమ వంతు వచ్చే వరకూ వేచి చూస్తారో.. మరో పార్టీలో అవకాశాలు వెతుక్కుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news