విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు గత మూడు రోజులుగా విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి వరుస సమవేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి.. డిస్కం సీఎండీలు డివిజన్ స్థాయిలో పర్యటించాలని ఆయన సూచించారు. రైతులకు విద్యుత్ ను ఇచ్చే ట్రాన్స్ ఫార్మర్‌లు కాలిపోతే తక్షణం స్పందించాలని, ఎక్కడా రాజీపడకూడదన్నారు.
గ్రౌండ్ లెవల్ లో విద్యుత్ వినియోగం, సరఫరాపై సమీక్షించుకోవాలని, డిస్కంల పనితీరును మరింత మెరుగు పరచాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్‌లు రీప్లేస్ చేసే సందర్భంలో అధిక జాప్యం వల్ల రైతులు పంట నష్ట పోతారని, వారం రోజుల్లో కాలిపోయిన వాటి స్థానంలో పని చేసేవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా పనులు వేగవంతం చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు.