గత 15 నెలలుగా మూడు వ్యవసాయ చట్టాల(ప్రస్తుతం రద్దుచేశారు)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధ హామీతోపాటు ఇతర సమస్యలపై చేపట్టిన ఆందోళనను శనివారం (డిసెంబర్ 11న) విరమించి ఇళ్లకు తిరిగి వెళ్తామని రైతు సంఘాలు ప్రకటించాయి.
గురువారం సాయంత్రం 5.30 గంటలకు విజయోత్సవ ప్రార్థనలు నిర్వహించడానికి రైతు సంఘాలు యోచిస్తున్నాయి. డిసెంబర్ 11న ఉదయం 9గంటలకు ఢిల్లీలోని సింఘు బార్డర్ నుంచి టిక్రీలోని ఆందోళన స్థలానికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. డిసెంబర్ 13న అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు నిర్వహించడం కోసం పంజాబ్ రాష్ట్ర రైతులు ప్రణాళికల వేస్తున్నారు. అయితే, రాకేశ్ టికాయత్ నేతృత్వంలోని సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన విరమణపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. డిసెంబర్ 15న మరో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది.