సీఎం కేసీఆర్ మోడల్ పాలిటిక్స్ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ మోడల్ అత్యంత ప్రమాదకరమైందన్నారు. అలాగే బీజేపీ కార్పొరేట్ మోడల్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే పైసలతో ప్రభుత్వాలను పడగొడుతున్నారన్నారు. కర్నాటకలో వందల కోట్లు ఖర్చు చేసేందుకు కేసీఆర్ పయత్నం చేస్తున్నారన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ను అస్థిరపరచాలని చూస్తున్నారన్నారు. ధన రాజకీయాలతో బీఆర్ఎస్ ను విస్తరించాలని చూస్తున్నారన్నారు. అవినీతి సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారన్నారు.
కేసీఆర్ భూదోపిడీపై సీబీఐకి లేఖ రాస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ భూదోపిడీని ఓ టీవీ సీరియల్ లాగా బయటపెడతానని తెలిపారు. రేపు యశోద హాస్పిటల్స్ కు భూకేటాయింపుల్లో దోపిడీ కోణం ఎపిసోడ్ బయటపెడతానని వెల్లడించారు. కరోనా చికిత్స ఔషధం రెమ్ డెసివిర్ ను బ్లాక్ లో అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.ఒక్క కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీంలకు సమానం అని పేర్కొన్నారు. కేసీఆర్ గజదొంగ అని, ఆయనతో కాంగ్రెస్ పార్టీ కలవదని స్పష్టం చేశారు.