బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం సాయత్రం ఓ ఏడు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. అందులో ఉన్న 17 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఆ భవనం శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకునే అవకాశం ఉన్నందున మరణించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసుల వెల్లడించారు.
సమచారం అందుకున్న అగ్నిమాపక దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వీరితోపాటుగా ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్‌లోని బాంబు నిర్వీర్యం విభాగం కూడా అక్కడకు చేరుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు డీఎంసీబహెచ్ పోలీసులు అధికారి బచ్చు మియా వెల్లడించారు.
ఈ భవనం కింద అంతస్తులో శానిటరీ ఉత్పత్తుల దుకాణాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన ఈ బిల్డింగ్‌కు పక్కనే బీఆర్ఏసీ బ్యాంక్ కూడా ఉంది. ఈ ప్రమాదం దాటికి ఆ బ్యాంకు అద్దాలు పగిలిపోయాయి. దీంతో పాటుగా రోడ్డుపై ఉన్న ఓ బస్సు కూడా ధ్వంసమైంది. వ్యాపార సముదాయంలో నిల్వ ఉంచిన రసాయనాల కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.