ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి కేసులో బీజేపీ నేతలు, కార్యకర్తలపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. మొత్తం 26 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 341, 148, 353, 332, 147, 509, 149 కింద పోలీసులు రిజిస్టర్ ఫైల్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నం.14లోని ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద సోమవారం బీజేపీ నేతలు ఆందోళన చేశారు. బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఇంటి దగ్గరున్న టీఆర్ఎస్ కార్యకర్తలను తరిమికొట్టి, ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే ఇప్పటివరకు బీజేపీ నేతలను అరెస్ట్ చేయలేదని, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. సీఆర్‌పీసీ 41 కింద నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది.