తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడిన ‘అసని’.. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కి.మీ., కాకినాడకు 180 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 550 కి.మీ., పూరీకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది.
ఆతర్వాత ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపూరం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే.. ఈ తుఫాను దృష్ట్యా 37 రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు రద్దు చేయగా… విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్ రైళ్లు, భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు, విజయవాడ-భీమవరం జంక్షన్ రైలు రద్దు చేసింది రైల్వే శాఖ. మరి కొన్ని రైళ్లు రీ-షెడ్యూల్ చేసింది రైల్వేశాఖ.