గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లో ఏకకాలంలో ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడి), ఐటి శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లోని గంగుల కమలాకర్ ఇంటితో పాటు మంకమ్మ తోటలో ఆయనకు చెందిన శ్వేతా గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్విఆర్ గార్డెన్స్ లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
గంగుల ఇంటి తాళాలు పగలగొట్టి మరి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సుమారు 20 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమలకు చెందిన పత్రాలను పరిశీలిస్తున్నారు. సాలార్పురియా సత్వ స్థిరాస్తి సంస్థకు చెందిన 316 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. సంస్థకు చెందిన 316 బ్యాంకు ఖాతాలలోని రూ.49.99 కోట్లు సీజ్ చేశారు. ఈ దాడుల్లో 29 లక్షల నగదు తో పాటు విదేశీ కరెన్సీ సీజ్ చేశారు ఈడీ అధికారులు. మనీలాండరింగ్ చట్టం కింద డబ్బుని స్వాధీనం చేసుకున్నారు.