ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ.. ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టే తాను పాదయాత్ర చేస్తున్నానని పేర్కొన్నారు. కెసిఆర్, కేటీఆర్ ఒక్కరోజు నాతో పాదయాత్రకు రావాలని, తెలంగాణలో సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతానని వైయస్ షర్మిల పేర్కొన్నారు. సమస్యలు ఉంటే మీరు రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చెయ్యండి అంటూ వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.
కెసిఆర్ అన్ని వర్గాలను మోసం చేశారంటూ మండిపడ్డారు. గాడిదకు రంగు పూసి ఆవు అని నమ్మించడమే కేసీఆర్ నైజం అని షర్మిల నిప్పులు చెరిగారు. తాగెటోడు ముఖ్యమంత్రి అయితే మందు కలిపేటోడు మంత్రి అయినా కావాలి కదా? అందుకే వీళ్ళ పాలన తాగుబోతు తాగి పన్నట్లు ఉందని షర్మిల విమర్శించారు. స్కూటర్ లో తిరిగే మంత్రి జగదీశ్వర్ రెడ్డి రూ.ఐదు వేల కోట్లకు ఎట్లా పడగలెత్తాడు? అన్నీ భూకబ్జాలు, మాఫియాలే అంటూ వైయస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.