క్యాంప్ ఆఫీస్ (శ్రీకాకుళం నగరం) : శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం అందరికీ ఆయువునూ,ఆనందాన్నీ ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఆత్మీయ సందేశంలో రాష్ట్ర ప్రజలకు విజయాలు వరించాలని,పాడి పంటలు సమృద్ధిగా పండి కష్టాలు తొలగిపోవాలని కోరారు.
ముఖ్యంగా రైతన్న బాగుంటేనే వారి ఇళ్లల్లో ఆనందాలు వెల్లివిరిస్తేనే దేశం బాగుంటుంది అన్న నమ్మకాలను ఈ పండుగ స్థిరం చేయాలని తాను కోరుకుంటూ ఉన్నానని తెలిపారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఈ పండుగ వేళ పరిఢవిల్లాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని వర్గాల యోగ క్షేమాలూ తాను కోరుకుంటున్నాని చెబుతూ, శ్రీకాకుళం జిల్లా ప్రగతికి తనవంతు కృషి ఎన్నడూ ఉంటుందని అన్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఓ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు డిజైన్ చేశామని, ఇందుకు ముఖ్యమంత్రి సైతం ఆమోదం తెలిపారని, తన కల జిల్లాలో మూడు పంటలూ పండి సస్యశ్యామలం కావాలన్నదే అని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలు ఇకపై కూడా ఉంటాయని తన తరఫు ఆకాంక్షను వెల్లడి చేశారు.ఇదే సందర్భంలో ప్రతి ఒక్కరూ మాతృభాష ఔన్నత్యాన్ని మరువ కూడదు అని, నేల తల్లి పరిరక్షణ ఎంత ముఖ్యమో,మాతృభాష పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని పునరుద్ఘాటించారు. అందరికీ మరో మారు శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ,సరికొత్త అభివృద్ధికి ఆది ఈ ఉగాది కావాలని పేర్కొంటూ తన సందేశం ముగించారు.