ఎవరిని ఎప్పుడు అదృష్టం వరిస్తుందో చెప్పలేం.. అందుకు ఈ ఘటనే నిదర్శనం.. ఎన్ని కష్టాలను ఓర్చి బతుకు బండి లాగుతున్న ఓ మహిళ రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారింది. మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలోని ఇత్వాకలా గ్రామంలో నివసించే చమేలి బాయి.. కృష్ణ కల్యాణ్‌పుర్ పాటి ప్రాంతంలో వజ్రాల గనిని లీజుకు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే లీజుకు తీసుకొని ఆమె మైనింగ్ ప్రారంభించింది. అయితే ఈ నేపథ్యంలో లీజుకు తీసుకున్న గనిలో 2.08 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో రాత్రికి రాత్రే వీరి జీవితం మారిపోయింది. చమేలి బాయి గనిలో దొరికిన వజ్రం మంగళవారం పన్నా డైమండ్ ఆఫీస్‌లో ఈ వజ్రాన్ని అధికారుల వద్ద డిపాజిట్ చేశారు చమేలి బాయి దంపతులు.
దీనికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధర నిర్ణయించి త్వరలో వేలం వేస్తారు. వజ్రం నాణ్యతను బట్టి దీనికి రూ.10 లక్షల వరకు పలకొచ్చని అధికారులు తెలిపారు. వేలంలో వచ్చిన ధర నుంచి పన్నులు, రాయల్టీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని మహిళకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. వజ్రాన్ని చూపిస్తున్న చమేలి బాయి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల గనిని లీజుకు తీసుకున్నామని చమేలి భర్త అర్వింద్ సింగ్ చెప్పుకొచ్చారు. వజ్రం దొరకడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వజ్రాన్ని వేలం వేసిన తర్వాత వచ్చిన సొమ్ముతో పన్నా నగరంలో ఇల్లు కొనుక్కుంటామని చెప్పారు.