ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో యువకులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ కొందరు లక్షల్లో డబ్బులు కోల్పోయి.. చివరకి వారికి కథ విషాదాంతంగా మిగులుతోంది. ఓ యువకుడు.. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి.. రూ. 1.80 లక్షలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల రూరల్ మండలంలోఈ ఘటన జరిగింది. అంతర్గాం గ్రామానికి చెందిన కొట్టాల తుక్కయ్య-గంగవ్వ కొడుకు తరుణ్‌రెడ్డి (21) జగిత్యాలలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.
మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌కు అలవాటు పడ్డ తరుణ్‌రెడ్డి.. సదరు గేమ్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేశాడు. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులు తరుణ్‌రెడ్డి బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఆన్‌లైన్ గేమ్ ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాలో నుంచి సుమారు రూ.1.80 లక్షలు పోగొట్టుకొన్నాడు తరుణ్‌రెడ్డి. ఇంట్లో తెలిస్తే ఏమంటారోనని భయాందోళనకు గురై ఈ నెల 10న పొలం వద్దకు వెళ్లి విషం తాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇది గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తరుణ్‌రెడ్డి మృతి చెందాడు. దీంతో తరుణ్‌రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.