వైరల్‌.. ఆప్‌ ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి..

-

ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆప్‌ ఎమ్మెల్యేపై ఆ పార్టీ కార్యకర్తలే దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు. తప్పించుకుని పారిపోతుంటే వెంటపడి మరీ చెప్పుతో కొట్టారు. దాడి ఎందుకు జరిగిందనే విషయంపై ఆప్ వర్గాల నుంచి స్పష్టత లేదు. అయితే, ఢిల్లీలో జరగబోయే సివిక్ పోల్స్ లో ఆప్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతలు పార్టీ టికెట్లను అమ్మకానికి పెట్టారని, అది సహించలేకే మాటియాలా నియోజకవర్గం ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ను కార్యకర్తలు కొట్టారని చెబుతున్నారు. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్యామ్ విహార్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఢిల్లీ సివిక్ పోల్స్ లో పార్టీ టికెట్ల పంపకానికి సంబంధించి ఈ మీటింగ్ లో చర్చ జరిగినట్లు సమాచారం.

delhi bjp alleges aap mla thrashed by party workers

వాడివేడిగా సాగిన ఈ సమావేశం ఓ దశలో అదుపుతప్పింది. ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ను కార్యకర్తలు నిలదీశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు గులాబ్ సింగ్ ప్రయత్నించారు. అయితే, కార్యకర్తలు ఆయనను అడ్డుకుని దాడి చేయడం మొదలు పెట్టారు. ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. పారిపోతున్న గులాబ్ సింగ్ ను ఓ కార్యకర్త గల్లా పట్టుకుని మరీ చెప్పుతో కొట్టడం వీడియోలో కనిపించింది. సదరు కార్యకర్త పట్టునుంచి విడిపించుని గులాబ్ సింగ్ పారిపోయారు. కాగా, ఈ దాడిపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించలేదు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. నీతిమంతమైన రాజకీయాలు చేస్తామని చెప్పుకునే పార్టీలో అవినీతిని ఆ పార్టీ కార్యకర్తలే భరించట్లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి జనం ఇలాగే బుద్ది చెబుతారని సంబిత్ పాత్రా జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news