ఓటీటీ వల్ల కొత్త విషయం తెలిసింది: అర్జున్​

-

కొవిడ్‌ వల్ల జరిగిన ఓ మంచి పని.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ రావడమని, దాని వల్ల రెవెన్యూ ఎక్కడెక్కడి నుంచి రాబట్టవచ్చో తెలిసిందని అన్నారు ప్రముఖ నటుడు అర్జున్‌. ఇటీవల నగరానికి విచ్చేసిన ఓ టీవీ ఛానల్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. పాన్‌ ఇండియా, చిన్న సినిమాల విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ వివరాలివీ…

ప్రస్తుతం పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరించాలి?

అర్జున్‌: పాన్‌ ఇండియా సినిమా అంటూ ఏం లేదనేది నా అభిప్రాయం. సినిమా బాగుంటే అది అన్ని చోట్లకూ వెళ్తుంది. ఈ విషయాన్ని కేజీయఫ్‌ నిరూపించింది. కన్నడ చిత్ర పరిశ్రమ చిన్నదని చాలామంది అనుకున్నారు. కానీ, అక్కడి నుంచి వచ్చిన ఆ చిత్రం.. విడుదలైన అన్ని ప్రాంతాల్లో అద్భుతంగా ఆడింది. ‘క్వాలిటీ సినిమా ఇస్తే మేం తప్పకుండా చూస్తాం’ అనే ప్రేక్షకుల మాట ప్రపంచ వ్యాప్తంగా నిజమైంది.

కొవిడ్‌ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? అనే ఆందోళన ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎలా ఉంది?

అర్జున్‌: కొవిడ్‌ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రారు.. సినిమాలు ఆడవనేది అవాస్తవమని స్పష్టమైంది. ఇప్పటి వరకు వచ్చిన మంచి చిత్రాలన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఆదరిస్తూనే ఉంటారు. ఇటీవల పలు తెలుగు సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. కథ బాగుంటే విజయం తథ్యం అనేది ఇప్పుడే కాదు ఎప్పటికీ వర్తిస్తుంది. కొవిడ్‌ వల్ల జరిగిన ఓ మంచి పని.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ రావడం. దీని వల్ల రెవెన్యూ ఎక్కడెక్కడి నుంచి రాబట్టవచ్చో తెలిసింది.

చిన్న సినిమాలు బతకాలంటే ఏం చేయాలి?

అర్జున్‌: అన్నింటి కంటే ముందు కథ బాగుండాలి. ప్రేక్షకులు ఎలాంటి కథలను ఆస్వాదిస్తున్నారో పరీక్షిస్తూ వాటికి తగ్గట్టు ఎంపిక చేసుకోవాలి. ఓటీటీలో ప్రేక్షకుడికి కావాల్సిన అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌ చిత్రాలు మినిమంలో మాగ్జిమం ఇస్తేనే ఆదరణ పొందుతాయి. ఇది సవాల్‌తో కూడుకున్నది.

మీ తదుపరి చిత్రాల గురించి చెబుతారా?

అర్జున్‌: నా కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా. అందులో విశ్వక్‌ సేన్‌ హీరో. నేను చిన్న పాత్రలో కనిపిస్తా. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌ సహా చాలామంది నటిస్తున్నారు. టైటిల్‌ త్వరలోనే ప్రకటిస్తాం. మరో రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. తెలుగులో కూడా దర్శకత్వం చేస్తాను. కథ సిద్ధంగా ఉంది. నా కుమార్తె సినిమా పూర్తి అయిన తర్వాత ఆ సినిమా చేస్తా. అందులో నాటి అర్జున్‌ను చూస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version