ఆప్ఘనిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు తీవ్ర దరిద్రంలోకి వెళుతున్నారు. చివరకు తినేందుకు తిండి కూడా దొరకడం లేదు. గతేడాది అమెరికా దళాలు నిష్క్రమణతో తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి రకరకాల కట్టుబాట్లతో ప్రజలను హింసిస్తున్నారు. ఆడవాళ్లు కేవలం ఇంటికే పరిమితం అయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. స్త్రీ విద్యను తాలిబన్లు వ్యతిరేఖిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో విదేశీ నిధులతో నెట్టుకొచ్చిన ఆప్ఘనిస్తాన్.. తాలిబన్ పాలనలోకి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విదేశీ నిధులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.
ప్రజల పరిస్థితి నిత్య నరకంలా మారింది అక్కడ. ఆకలి తీర్చుకునేందుకు ప్రజలు కిడ్నీలను అమ్ముకుంటున్నారు. తమ కుటుంబాలు, పిల్లల ఆకలి తీర్చేందుకు వేరే మార్గం లేక అవయవాలను అమ్ముకునే పరిస్థితికి దిగజారారు. ఐక్యరాజ్య సమిగి అంచనాల ప్రకారం 24 మిలియన్ల మందికి అంటే మొత్తం జనాభాలో 59 శాతం మందికి అత్యవసరంగా మానవతా సాయం అవసరం. ఇది 2021కన్నా 30 శాతం అధికం.