ఆఫ్గాన్ ఆకలితో అలమటిస్తోంది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రజలు కిడ్నీలు అమ్ముకుంటున్న వార్తలు బయటకి వచ్చాయి. తాజాగా ఆకలి తీర్చుకునేందుకు సొంత బిడ్డలనే అమ్ముకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆఫ్గానిస్తాన్ లో తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. ఐదేళ్ల పిల్లలు ఆకలితో చనిపోయే పరిస్థితులు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గతేడాది ఆగస్టు నెలలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పరిస్థితులు దిగజారాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు మెజారిటీ దేశాలు ముందుకు రావడం లేదు. ఆఫ్గానిస్తాన్ ఎక్కువగా విదేశీ నిధులపైనే నడుస్తుంది. అలాంటిది ఇతర దేశాలు సాయం చేసేందుకు ఎక్కువగా ముందుకు రావడం లేదు. దీంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా మంది ఆఫ్గన్- పాకిస్తాన్ బార్డర్లలో చాలా మంది ఆఫ్గన్ శరణార్థులు సరిహద్దులు దాటేందుకు ఎదురుచూస్తున్నారు.