తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఫైర్ అన్నారు. తీన్మార్ మల్లన్న చేసిన పని… దుర్మార్గమని మండిపడ్డారు. చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ Q న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ”బాడీ షేమింగ్” కు పాల్పడడం దుర్మార్గమైనదని… దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అల్లం నారాయణ పేర్కొన్నారు.
యూట్యూబ్ ఛానల్ పేరిట వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైందని…దీనిని ఎవరూ అంగీకరించరన్నారు. జర్నలిస్టుల పేరిట పత్రికా స్వేచ్ఛ పేరిట వాడుతున్న భాషను రాజకీయ విధానాల మీద కాకుండా కుటుంబ సభ్యులను వివాదాలకు లాగుతున్న ప్రయత్నాలను తాను ఖండిస్తున్నట్లు.. అసలు ఇది జర్నలిజమే కాదని నిప్పులు చెరిగారు. ఈ భాష జర్నలిస్టులు వాడదగినది కాదని… పత్రికా స్వేచ్ఛ పేరిట ఇదొక అన్యాయమైన అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. యూట్యూబ్ ఛానళ్ల పేరిట సోషల్ మీడియాలో చలామణి అవుతున్న చాలామంది ప్రాథమికంగా జర్నలిస్టులు కాదని చురకలు అంటించారు.