అమరావతి రైతుల మహాపాదయాత్ర 2.0.. 15వ రోజుకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. సోమవారం దెందులూరు నియోజకవర్గం కొనికి నుంచి రైతులు పాదయాత్ర కొనసాగుతోంది.
కొనికి నుంచి ప్రారంభమైన పాదయాత్ర కడిమికుంట, సకల కొత్తపల్లి, సత్యవోలు, నాయుడుగూడెం, పెదపాడు, సత్యనారాయణపురం, అందేఖాన్ చెరువు మీదుగా ఏలూరు మండలం కొత్తూరు వరకు మొత్తం 15 కి.మీ మేర సాగుతోంది. మధ్యాహ్నం పెదపాడులో భోజనం విరామం తీసుకుంటారు. రాత్రికి వట్లూరు క్రాంతి కల్యాణ మండపంలో బస చేయనున్నారు.
అమరావతి పరిరక్షణకోసం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఏలూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు, మాజీ మంత్రి జవహర్, మాజీ ఎంపీ మాగంటి బాబు, జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలువురు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.