మరోసారి టీడీపీపై విమర్శలు గుప్పించారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీకి రాకుండా పారిపోయిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అంటూ అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, తెలుగు దేశం జెండాలు పట్టుకుని హడావిడి చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజలు మాత్రం ప్రభుత్వం చేసిన సహాయ కార్యక్రమాలు అందాయి అని స్పష్టం చేశారన్నారు అంబటి రాంబాబు.
కోడి కత్తిలో కమలహాసనే కాదు భారతీయుడిలో కూడా కమల్ హాసన్ ఉన్నాడని, చంద్రబాబు చూసినట్లు లేడంటూ ఎద్దేవా చేశారు. పోలవరం ముంపు గ్రామాలకు చంద్రబాబు వెళ్ళాడని, 1986లో గోదావరికి వరద వచ్చినపుడు భద్రాచలం దగ్గర కరకట్ట కట్టానని చెబుతున్నాడని, ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు పోలవరం పూర్తి చేయలేక పోయావు అని ఆయన ప్రశ్నించారు.
బస్సుల్లో జనాలను తీసుకుని వెళ్లి చంద్రన్న చంద్రన్న అంటు భజన చేయించావుగా.. కాఫర్ డ్యాం కట్టకుండా డ్రయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టాడో చంద్రబాబు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. సెంట్రింగ్ వేయకుండా శ్లాబ్ వేసేశావని, కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. డబ్బులకు కక్కుర్తిపడి కాదా?? 2018లో పూర్తి చేస్తానని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదు?? చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలన్నారు అంబటి రాంబాబు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అని అంబటి రాంబాబు మండిపడ్డారు.