2002 గుజరాత్ అల్లర్లపై ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’ పేరిట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. దానిని భారత్ తీవ్రంగా ఖండించింది. అదొక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది. తాజాగా దీనిపై అమెరికా స్పందించింది.
‘మీరు చెప్తున్న డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్‌కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. భారత ప్రజాస్వామ్యం శక్తిమంతమైది. ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై మా దృష్టి ఉంటుంది. అలాగే ఈ బంధాన్ని బలోపేతం చేసే అంశాల గురించి మేం ఆలోచిస్తాం. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. అమెరికా, భారత్ ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉంది’ అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు.
దీనిపై ఇదివరకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఇదే తరహాలో స్పందించారు. ఆ డాక్యుమెంటరీ వివాదం నుంచి దూరం జరిగారు. అందులోని విషయాలను తాను పూర్తిగా అంగీకరించలేనని వెల్లడించారు.