కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా నేడు విశాఖలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం, అక్కడి అధికార పార్టీ పాలకులపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. విశాఖ లో జరిగిన బీజేపీసభలో వైసీపీ సర్కారు తీరును ఎండగట్టారు. రాష్ట్రానికి జగన్ ప్రభుత్వం చేసింది, చేస్తున్నది ఏమీ లేదన్నారు షా.
కేంద్రం ఇచ్చే నిధులు, సంక్షేమ పథకాలను భరోసా పేరుతో తాము చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని జగన్ తన ఫోటోలు పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప మరొకటి జరగలేదన్నారు. జగన్ ప్రభుత్వం తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకోవడంపై అమిత్‌షా కౌంటర్ ఇచ్చారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 9 ఏళ్ళ కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీకి 5 లక్షల కోట్లు ఇచ్చిందని .. అయినప్పటికి ఏపీ ముందడుగు వేసిందా అని వైసీపీ పాలకుల్ని ప్రశ్నించారు. మరి కేంద్రం ఇచ్చిన ఈ డబ్బు ఎక్కడకు వెళ్ళిందని
అమిత్‌షా నిలదీశారు. ప్రభుత్వ అవినీతిలో కనిపించడమే లేదన్నారు.
కాంగ్రెస్ పాలనలో కూడా 12లక్షల కోట్ల అవినీతి జరిగితే అప్పటి ప్రధాని మన్మోహన్ ఏమి చేయలేకపోయారని..మోదీ 9ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు. పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే సర్జికల్ స్ట్రైక్‌తో ప్రతీకారం తీర్చుకొని పాక్‌కు బుద్ధిచెప్పామన్నారు. కేంద్రంలో మోదీ 9ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నసందర్భంగా విశాఖ సాగరతీరంలో ఏర్పాటు చేసిన సభలో అమిత్‌షా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 20స్థానాల్లో గెలిపించాలని కోరారు.